7 చారిత్రాత్మక తప్పిదాలు: చంద్రబాబునాయుడు ఓటమికి కారణాలు ఇవేనా?

- Advertisement -

అమరావతి: నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మళ్లీ మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణం.. అందరూ అంటున్నట్టు వయసు ప్రభావమేనా? అందువల్లనే ఆయన తీసుకున్న రాజకీయ వ్యూహాలు, నిర్ణయాలన్నీ గోడకు కొట్టిన బంతిలా తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాయా?

ఈ ప్రశ్నలకు ఒకరకంగా అవుననే సమాధానమే వస్తోంది. అయితే ఏపీలో టీడీపీ పరాజయానికి కేవలం ఆ పార్టీ అధినేత వయసు ప్రభావం ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు అపర చాణుక్యుడు అనే పేరు సంపాదించిన చంద్రబాబు ప్రభ మసక బారి పోవడానికి, ఏపీలో ప్రస్తుతం టీడీపీ దుస్థితికి దారితీసిన కారణాలేమిటి? అనే అంశంపై ‘న్యూస్ ఎక్స్‌ప్రెస్’ అందిస్తోన్న.. ప్రత్యేక కథనం.

ఈనాటి ఓటమి.. చంద్రబాబు నాయుడికి ఒక్కరోజులో వచ్చినదేమీ కాదు.  ఎందుకంటే తన హయాంలో చంద్రబాబు కొన్ని చారిత్రాత్మక తప్పిదాలు చేశారనే విమర్శలున్నాయి. అవే కొన్నేళ్లుగా కొండల్లా పెరుగుతూ పోయాయి. వాటిలో ముఖ్యమైనవి, ప్రధానమైనవి ఏడు, అవేమిటంటే…

మొదటి తప్పిదం…

ఉన్నది లేదన్నట్లుగా చూపే మీడియా.. సోషల్ మీడియా వచ్చాక.. ఈ అనుంగు పత్రికల వార్తలకు విలువ లేకుండా పోయింది. అంతేకాదు.. ఆ రోజుల్లో జనం అంతగా చదువుకోలేదు. తెలివైన వాళ్ళు కాదు..

కానీ ఇప్పుడు మరో తరం వచ్చేసింది.. వీళ్ళు ఇంగ్లిష్ మీడియం చదువుకున్నారు, ర్యాంక్‌లు తెచ్చుకునే తెలివైన వాళ్లు…
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఆలోచనలు, అనుంగు మీడియా ఆలోచనలు కాలానికి తగినట్లుగా మారలేదని ఒక విశ్లేషణ. ఒకటే ఊక దంపుడు బియ్యంతో వండిన వంటనే పెట్టడం వల్ల జనానికి రుచించలేదని.. సారాంశం.

రెండో తప్పిదం…

అమరావతి, పోలవరం లాంటి శక్తికి మించిన ప్రాజెక్టులు.. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే పూర్తి చేస్తానంటూ  చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు పలకడం.. ఎన్నికల సమయం వచ్చేవరకు… రేపు, మాపు అంటూ చెప్పడం, చెప్పినవీ చేయలేక.. ఇంకా ప్రజలను ఒక మాయలో.. భ్రమలో నడిపించడంతో ఆయన క్రెడిబిలిటీ పోయింది.

మూడో తప్పిదం..

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. హైదరాబాద్ ఒక్కదాన్నే అభివృద్ధి చేయడం.. తీరా రాష్ట్ర విభజన జరిగాక.. ఖాళీ చేతులలో అమరావతి రావడంతో.. ఆయన చేసిన పొరపాటు ఆయన్నే వెక్కిరించేలా మారి.. విమర్శల పాలు చేయడమేకాక ఇప్పుడు నలుగురిలో నవ్వులపాలు చేసింది. 

నాలుగో తప్పిదం..

అంతవరకు కాంగ్రెస్ పార్టీని తిట్టి.. తిట్టి.. ఆ పార్టీపై వ్యతిరేకతతో.. ఆవిర్భవించిన తెలుగుదేశాన్ని తీసుకెళ్లి.. మళ్లీ వారి పంచనే నిలబెట్టడం చంద్రబాబు చేసిన మరో రాజకీయ తప్పిదం.  ఇది.. రాజకీయాల్లో విలువలు లేవు.. అనే మాటకు.. నేనూ అతీతం ఏమీ కాదని చెప్పినట్లయింది.

అంతకన్నా ముఖ్యమైనది.. తన బినామీలను కాపాడుకోవడానికి, సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టవద్దని అనడం, ఆ భయంతోనే చంద్రబాబు జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ రక్షణ కోరినట్లు.. అంతా సోషల్ మీడియాలో ఏకి పారేశారు.

ఐదో తప్పిదం..

ఒకప్పుడు కేంద్రంలో వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి.. అవసరాలన్నీ తీరాక.. ఇలాగే ఎన్నికల చివరిలో.. వారికి హ్యాండ్ ఇవ్వడమేకాక.. బీజేపీయే తమను మోసం చేసిందంటూ.. అనుంగు పత్రికల్లో వార్తలు రాయిచుకొని.. ఆ సానుభూతితో ఎన్నికలకు వెళ్లారు.

సేమ్ అదే స్ట్రాటజీ.. ఇప్పుడు కూడా బాబు ప్లే చేశారు. కానీ అప్పుడు అమాయక వాజపాయి.. అయితే ఇప్పుడున్నది కరడుగట్టిన నరేంద్ర మోడీ. పాకిస్తాన్‌కే చుక్కలు చూపించిన మోడీని సవాల్ చేయడం.. చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయ్యింది.

అందరూ అనేమాట.. చంద్రబాబు తొందరపడి బీజేపీతో గొడవ పడకుండా ఉండాల్సింది అని. అంతేకాకుండా బీజేపీ, మోడీ
అంతు చూస్తానని మాట్లాడటం.. కూడా ఆయన్ని రిస్క్‌లో పడేలా చేసింది.  అలాగే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లడం వల్ల.. మామూలుగా టీడీపీకి వచ్చే సీట్లు కూడా పోయాయనేది.. అందరూ అనుకునే మాట.

ఒకప్పుడు యునైటెడ్ ఫ్రంట్ లు ఏర్పాటు చేయడంలో చంద్రబాబుకి మంచి అనుభవం.. తమకు ఉపయోగ పడుతుందని.. ఢిల్లీలో కాంగ్రస్ పెద్దలు, ఆ పార్టీ అధిష్టానం భావించింది. ఆ తరువాత ఇంటా, బయట కూడా చంద్రబాబు వ్యూహాలు బెడిసికొట్టడం.. చూస్తుంటే ఆయనకు ఈసారి రాజకీయ సన్యాసం తప్పేలా లేదని అందరికీ అర్థమైపోయింది.

ఆరో తప్పిదం…

ఇంతకుముందు చంద్రబాబుకు ఓ మంచి అడ్మిమిని‌స్ట్రేటర్‌గా పేరు ఉండేది. అయితే అవినీతి అధికారులను దరిజేరనివ్వడం, తన మంత్రివర్గంలో నేతలు, ఎమ్మెల్యేలు.. అందరూ అవినీతిలో పీకల్లోతు మునిగిపోయినా పట్టించుకోకపోవడం.. ఇది ప్రజల్లో ఆయనపై ఉన్న అపార విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది.

అంతేకాదు ప్రభుత్వ పథకాలు కేవలం తెలుగుదేశం కార్యకర్తలకే అందేలా చూడటం, మిగిలినవారిని పక్కన పెట్టడం విమర్శల పాలైంది. గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడకుండా అందరికి లబ్ధి చేకూర్చే పనులు చేయడమే ఆయన్ని ప్రజల్లో దేవుడిని చేసింది.

ఇక ఆఖరుగా ఏడవది..

అందరు తండ్రులు తమ వారసులను తీర్చిదిద్దారు. వైస్ రాజశేఖర్ రెడ్డి.. కుమారుడిగా జగన్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిపోతే.. అటు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా రెడీ అయిపోతే.. చంద్రబాబు కుమారుడు లోకేష్ మాత్రం వారి స్ధాయిలో ఎదగలేకపోవడం.

తాజా ఎన్నికల్లో లోకేష్ తాను పోటీ చేసిన మంగళగిరిలో ఓడిపోవడం గమనిస్తే.. భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీని నిలబెట్టేవారెవరు? అన్న ప్రశ్న ఉదయించకమానదు. ఇలా చంద్రబాబు నాయుడి వ్యూహాత్మక తప్పిదాలెన్నో చేసుకుంటూ వెళ్లారు.. అవే ఈనాటి ఆయన ఘోర ఓటమికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.

చదవండి: మిషన్ 150+: ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయిన సైకిల్….

– శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -