కేంద్రమంత్రి గడ్కరీతో ముగిసిన జగన్ భేటీ.. చర్చించిన అంశాలివే..

- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ ఉదయం జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీతో జగన్ హస్తిన పర్యటన ముగియడంతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏపీకి తిరుగు పయనం అయ్యారు.

గడ్కరీతో ఏం చర్చించారంటే?

విశాఖ- భోగాపురం బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు.. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం జగన్‌ వివరించారు.

వైజాగ్ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని గడ్కరీని కోరారు.

విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే, విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను ఇప్పటికే గుర్తించిందని వెంటనే డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు.

రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరు చేయాలని జగన్ విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వేల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని గడ్కరీని జగన్ కోరారు.

- Advertisement -