అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఆ గాలి కూడా అలా ఇలా వీయలేదు…ఓ సుడిగాలి స్థాయిలో వీచింది. ఈ సుడిగాలిలో తెలుగుదేశం పార్టీ సైకిల్ తునతునకలు అయిపోయింది. ఇక జనసేన గాజు గ్లాసు అయితే ముక్కలుముక్కలు అయిపోయింది.
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 50 శాతం ఓట్ షేర్‌తో 151 స్థానాల్లో జయభేరి మోగించింది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకి గాను 22 స్థానాలని కైవసం చేసుకుంది. శ్రీకాకుళం నుంచి కడప వరకు వైసీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇక విజయనగరం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలని క్లీన్ స్వీప్ చేసింది.
తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ మరణానంతరం ఎనిమిదేళ్ల కిందట వైసీపీని ఏర్పాటు చేసి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా పట్టువీడక పోరాడిన జగన్మోహనరెడ్డి… నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 30న విజయవాడలో పదవీ ప్రమాణం చేయబోతున్నారు.
దారుణంగా ఓడిపోయిన టీడీపీ…
చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మునుపెన్నడూ లేని విధంగా దారుణ పరాజయాన్ని చవిచూసింది. 175 స్థానాల్లో 39 శాతం ఓట్ షేర్‌తో కేవలం 23 స్థానాలని గెలుచుకుంది. పార్లమెంట్ సీట్లలో విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం స్థానాలని కైవసం చేసుకుంది.
నెల్లూరు, కడప, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తమను బాగా ఆదుకుంటాయని భావించిన కృష్ణా, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి రెండేసి సీట్లు మాత్రమే దక్కాయి. ఇక విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో నాలుగేసి సీట్లు చొప్పున గెలుచుకుంది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబు ఒక్కరే గెలిచారు.
జనసేనలో ఒకే ఒక్కడు…
సినీ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌కు ‘డబుల్ షాక్’ తగిలింది. ఆయన పోటీ చేసిన గాజువాక, భీమవరం… రెండు చోట్లా ఓడిపోయారు. ఒకేఒక్క జనసైనికుడు రాపాక వరప్రసాద్ మాత్రం రాజోలు నుంచి గెలిచారు.








