
కఠ్మాండూ: నేపాల్ అంతర్గత రాజకీయాల్లో చైనా జోక్యం పెరిగిపోతోంది. ఇటీవల అధికార నేపాలీ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ)లో రగులుతున్న వివాదానికి ఆ దేశంలో చైనా రాయబారి హౌ యాంకీ కేంద్ర బిందువయ్యారు. ఎన్సీపీలో ఏప్రిల్ నుంచి అంతర్గతంగా రగులుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం హౌ యాంకీ నేపాల్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులతో సమావేశమై చర్చించారు.
నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి పరిపాలన సరిగా లేదని, ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండ నేతృత్వంలో అసమ్మతి వెల్లువెత్తుతోంది. ఏప్రిల్ నెలాఖరు నుంచి అంతర్గతంగా కొనసాగుతున్న ఈ వివాదం గురించి హౌ యాంగ్‌కు తెలుసు. ఏప్రిల్ నెల చివరలో, మే నెల మొదట్లో పలువురు అధికార కమ్యూనిస్టు పార్టీ నేతలతో ఆమె చర్చించారు. అయినప్పటికీ వివాదం ఇప్పుడు బయటకొచ్చింది.
నేపాల్‌లోని కమ్యూనిస్టు నాయకులను ఏకతాటిపైకి తేవడంలో చైనా కీలకపాత్ర పోషించి ఉంటుందని, అందుకే ఇప్పుడు అధికార పార్టీలో అసమ్మతిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో హౌ యాంకీ పలువురు నేపాల్ నేతలతో చర్చించారు. జూలై 3న నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని కలిశారు.
ఈ నెల 5న సీనియర్ నాయకుడు మాధవ్‌కుమార్ నేపాల్‌తో హౌ సమావేశమయ్యారు. ఏప్రిల్, మే నెలల్లో ప్రధాని కేపీ శర్మ ఓలి, ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ)తో యాంకీ భేటీ అయ్యారు. అయితే నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉండటం, పార్టీలో చీలిక రాకుండా చైనా జోక్యం చేసుకోవడం చూస్తుంటే భవిష్యత్తులో నేపాల్ రాజకీయాలపై చైనా పైచేయి సాధిస్తుందేమోనన్న అనుమానం కలుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.








