సమస్త మానవాళి పాప విమోచన కోసం కన్యక మరియ గర్భమందు జన్మించి ఈ లోకంలోకి అడుగిడిన యేసుక్రీస్తు చివరికి అనేక చిత్రహింసలకు గురై, శిలువపై తన ప్రాణాన్ని వదిలారు. ఆయన ప్రాణాలు వదిలిన శుక్రవారాన్ని ఏటా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ‘గుడ్ ఫ్రైడే’గా జరుపుకుంటారు.
ఆ రోజంతా యేసు క్రీస్తును తలచుకుంటూ, శిలువలో ఆయన అనుభవించిన వేదనను గుర్తు చేసుకుంటూ, ప్రార్థనలలో గడుపుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో ‘గుడ్ ఫ్రైడే’ మననం చేసుకొంటారు.
ఈ నేపథ్యంలో ఈ భూమ్మీద మనుషుల కోసం, వారు చేసిన పాపాల ప్రక్షాళన కోసం ఏ పాపమూ ఎరుగని యేసుక్రీస్తు ఎలాంటి చిత్రహింసలకు గురయ్యాడో తెలుసా?
నాటి రోమన్ పాలకులు.. ఆ కాలంలో ఇతర శిక్షలు ఎన్నో ఉండగా.. అవి విధించకుండా.. ఆయనకు శిలువ శిక్ష మాత్రమే ఎందుకు విధించారు? శిలువపై ఉన్న యేసుక్రీస్తు ఏం మాట్లాడాడు.. వాటి అర్థం ఏమిటో మీకు తెలుసా?
శిలువ శిక్షే ఎందుకంటే…?
నేరస్తుడు వెంటనే మరణించకుండా.. అంటే మరణం అంత సులువుగా రాకుండా.. తీవ్రమైన బాధను అనుభవిస్తూ నెమ్మది నెమ్మదిగా.. కొద్ది కొద్దిగా మరణించాలనే ఉద్దేశంతోనే శిలువ శిక్ష విధించేవారు. ఈ శిక్షను మొట్టమొదటిసారిగా ఫోనీషియన్లు అమలు పరిచారు.
ఆ తరువాత పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరిచారు. నాటి రోమన్లు ఈ శిలువ శిక్షను అత్యంత అవమానకరమైన కార్యంగా భావించేవారు. అయితే రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు ఈ రకమైన శిక్షను విధించకూడదు.
ఇతర దేశస్తులు, బానిసలు, అలాగే తిరుగుబాటుదారులైన నేరస్తులకు మాత్రమే ఇలాంటి శిక్ష విధించేవారు. ఏసుక్రీస్తుకు ఈ శిలువ శిక్షే ఎందుకు విధించారంటే.. ఏసుక్రీస్తు తన బోధనలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, నాటి రోమన్ పాలకులపై ప్రజలు తిరగబడేలా ఆ బోధనలు ఉంటున్నాయని.
నిజానికి ఏసుక్రీస్తు ఏనాడూ అలా ప్రవర్తించనే లేదు. ఆయన తోటివారిని ప్రేమించమన్నారు. అంతేకాదు, తప్పుచేసిన వారిని సైతం క్షమించమన్నారు. ఇక ఇందులో తిరుగుబాటు ప్రస్తావన ఎక్కడిది?
మానవ పుర్రె ఆకారంలో ఉన్న కొండపై…
ఇక ఏసుక్రీస్తును శిలువేసిన స్థలాన్ని హెబ్రీ భాషలో గొల్గొతా అని, లాటిన్ భాషలో కల్వరి అని అర్థం. ఈ పదాలకు పుర్రె లేదా కపాలం అని అర్థం. ఏసును శిలువ వేసిన కొండ మానవ పుర్రె ఆకారంలో ఉండేది. అంతేకాకుండా ఆ శిలువ బరువు కూడా దాదాపు 136 కిలోల కన్నా ఎక్కువ బరువు ఉండేదని పరిశోధకుల అంచనా.
అలాగే శిలువ వేయబడే నేరస్తుడి తల పైభాగంలో అతడిని ఎందుకు అలా చేయవలసి వచ్చిందో రాసిన పలకను ఏర్పాటు చేస్తారు. ఏసుక్రీస్తు శిలువపై ‘నజరేయుడగు ఏసు యూదుల రాజు అని మూడు భాషలలో రాశారు.
శిష్యుడే ప్రలోభానికి గురై…
ఏసుక్రీస్తును ప్రజలు విశ్వసించడాన్ని రోమాలో నాటి మతాధిపతులు భరించలేకపోయారు. వారే ఏసుపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. నాటి రోమా గవర్నర్ పిలాతు వద్దకు వెళ్లి ఆయనపై లేనిపోనివి కల్పించి చెప్పి, ఆయన్ని బంధించి పట్టుకొచ్చేందుకు అవసరమైన ఆదేశాలు పొంది, సైనికులను వెంటబెట్టుకుని వెళతారు.
అయితే ఏసు ఎక్కడున్నాడు? ఎవరు ఆయన్ని గుర్తుపడతారు? అప్పుడు ఏసుక్రీస్తు శిష్యులలో ఒకరైన ఇస్కరియోతు యూదాను ప్రలోభానికి గురిచేసి, 33 వెండి నాణేలను లంచంగా ఇచ్చి, ‘ఇదిగో మీరు వెతుకుతున్న ఏసు ఈయనే..’ అని వాడు చెప్పగానే ఏసుని బంధిచమని తమ వెంట వచ్చిన సైనికులను ఆదేశిస్తారు.
ఏ పాపమూ ఆయనలో కనిపించకపోయినా…
ఏసుక్రీస్తును బంధించి తన వద్దకు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యలు, యూదులు తీసుకురాగా.. నాటి రోమా గవర్నర్ పిలాతు.. ఆయనలో ఏ పాపం కనబడనప్పటికీ.. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారి కోరిక మేరకు ఏసుక్రీస్తుకు శిలువ శిక్షను విధిస్తారు. ఇక ఆ తరువాత ఏసును చిత్రహింసలకు గురిచేస్తారు.
శిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి… ఆ ముళ్లు ఆయన శిరస్సుపై దిగేలా సుత్తితో కొడతారు. ఆయన్ని ఏ శిలువపైన అయితే వేలాడదీస్తారో.. ఆ శిలువను కూడా ఆయన చేతే మోయిస్తారు.
తన శిలువను తానే మోసి…
అలా భుజాలపై శిలువను మోపి దాదాపు ఒక కిలోమీటరు దూరం నడిపించిన తరువాత.. ప్రేతోర్యం అనే స్థలములో ఏసుక్రీస్తును తీవ్రంగా కొడతారు. దీనికి వారు ఒక కొరడాను ఉపయోగిస్తారు. ఆ కొరడా తయారైన విధానమే అతి భయంకరమైనది.
ఒక్కొక్క కొరడాలో నాలుగు శాఖలుంటాయి. చెక్కతో చేయబడిన పిడి దానికి ఉంటుంది. జంతువుల చర్మంతో చేయబడిన త్రాళ్ళ కొనలకు పదునైన.. ఎండిన ఎముకలు మరియు లోహపు గుళ్ళు ఉంటాయి. అటువంటి కొరడాతో ఏసును అతి తీవ్రంగా కొడతారు.
కొరడా శిక్ష ఎంత భయంకరమంటే…
ముందుగా కొరడా శిక్ష విధించబడిన వ్యక్తి వస్త్రములు లాగివేస్తారు. ఆ ప్రదేశంలో ఏర్పాటు చేయబడిన ఒక మానుకు ఆ వ్యక్తిని కదలకుండా కట్టివేసి, వెనుక భాగాన ఇద్దరు సైనికులు నిలబడిఒకరి తర్వాత మరొకరు విపరీతంగా కొడతారు. దెబ్బలు కొట్టే సైనికులే అలిసిపోతారంటేనే పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు.
ఆ కొరడా ఒంటిపై తగిలినప్పుడల్లా.. దానికి ఉండే లోహపు గుళ్ళు తీవ్రమైన నొప్పిని కలుగచేస్తాయి… అలాగే పదునైన ఎముకలు… ముళ్ళు… శరీరంలోనికి దిగబడి మాంసాన్ని కొద్దికొద్దిగా పెకిలిస్తూ ఉంటుంది.
మానవమాత్రుడైతే భరించగలిగే వాడా…?
ఈ ప్రక్రియలో చాలా మంది తీవ్ర రక్త స్రావంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేస్తుంటారు. కానీ సమస్త మానవాళికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించడం కోసం అంతటి తీవ్ర బాధను సైతం ఏసుప్రభువు భరించారు.. అనుభవించారు.
ఆ తరువాత కూడా మళ్లీ తన శిలువను ఎత్తుకుని.. రక్తమోడుతున్న శరీరంతో.. ఎంతో దూరం నడిచి.. చివరికి ఆ గొల్గొతా కొండపైకి చేరుకుంటారు. మార్గం మధ్యలో కురేనీయుడైన సీమోను కూడా ఏసు శిలువ బరువును కొద్దిసేపు మోసి సహకరిస్తాడు.
కాళ్లు, చేతులపై మేకులు దిగ్గొట్టి…
ఇక శతాధిపతి ఆధ్వర్యంలో సైనికులు వెంట రాగా.. శిలువ వేసే స్థలానికి చేరుకున్న తరువాత నేరస్తులకు బోళము కలిపిన ద్రాక్షారసము ఇస్తారు. అది వాళ్ల ఆచారం. కానీ ఏసుక్రీస్తు దానిని కూడా నిరాకరిస్తారు. ఆ వెంటనే ఏసును సిలువపై పడుకోబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొడతారు.
భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా చూస్తే.. ఇనుముతో చేయబడిన ఆ మేకులు సుమారు 7 అంగుళాల (18 సెం.మీ) పొడవు ఉండేవట. సుమారు 1 నుండి 2 సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. ఆ బాధను కూడా ఏసుక్రీస్తు భరించాడు.
శిలువపై ఉండి ఏసుక్రీస్తు పలికిన మాటలివే…
అన్ని చిత్రహింసలు అనుభవించిన తరువాత కూడా ఏసుక్రీస్తు సిలువపై సుమారు ఆరు గంటలపాటు వేలాడతారు. శిలువపై ఉండి ఆయన ఏడు మాటలు పలికిన తరువాతే.. పెద్ద కేక వేసి తన ప్రాణాలు విడుస్తారు. ఉదయం 9 గంటలకు ఆయన్ని శిలువ వేయగా.. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణిస్తారు.
మొదటి మాట: (లూకా సువార్త 23:34)
శిలువపై వేలాడుతూ ఏసుక్రీస్తు పలికిన మొదటి మాట – ‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుము’ అన్నది. ఈ మొదటి మాట ఆయనలోని క్షమా గుణాన్ని తెలుపుతోంది. అంతగా తనను చిత్రహింసల పాల్జేసినా.. ఏసుక్రీస్తుకు వారిపై కోపం రాలేదు. పైగా ఆయన వారిని క్షమించమని కోరాడు.
రెండో మాట: (లూకా సువార్త 23:43)
తనతోపాటుగా శిలువ వేయబడిన దొంగల్లో ఒక దొంగ పశ్చాత్తాప పడగా.. ఏసు కరిగి.. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా చెప్పుచున్నాను’ (లూకా సువార్త 23:43) అని అంటాడు. ఇది శిలువపై ఉండగా ఆయన పలికిన రెండో మాట.
మూడో మాట: (యోహాను సువార్త 19:26-27)
ఇక ఏసు పలికిన మూడో మాట.. తన తల్లి మరియమ్మను తన శిష్యుడైన యోహానుకు చూపిస్తూ.. ‘ఇదిగో ఈమె నీ తల్లి’ అంటూ యోహానుకు ఆమె బాధ్యతను అప్పగిస్తాడు. అలాగే తన తల్లి మరియమ్మ వైపు చూసి.. ‘అమ్మా.. ఇదిగో నీ కుమారుడు’ అంటూ యోహానును ఆమెకు చూపిస్తాడు. ఈ చర్య యేసు యొక్క ప్రేమ బాంధవ్యాలను సూచిస్తోంది.
నాలుగో మాట: (మత్తయి సువార్త 27:46)
‘ఏలీ ఏలీ లామా సబక్తాని’ అనే మాటకు అర్ధం ‘నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి..’ అని. ఇది ఏసు పలికిన నాలుగో మాట. ఈ మాట తన తండ్రి అయిన యహోవాతో ఏసుకు ఏర్పడిన వియోగాన్ని తెలుపుతుంది.
అయిదో మాట: (యోహాను సువార్త 19:28)
ఆయన పలికిన అయిదో మాట.. ‘దప్పిగొనుచున్నాను’ అన్నది. ఈ మాట ఆయన అన్వేషణకు గుర్తుగా నిలుస్తుంది.
ఆరో మాట: (లూకా సువార్త 19:30)
‘సమాప్తమైనవి’ అన్నది. ఈ ఆరో మాట ఏసుక్రీస్తు పూర్తి చేసిన శిలువ బలి యాగాన్ని.. తన తండ్రి అయిన యెహోవా తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడాన్ని స్ఫురింపజేస్తుంది
ఏడో మాట: (లూకా సువార్త 23:46)
శిలువపై వేలాడుతూ చివరగా యేసుక్రీస్తు పలికిన మాట ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అనేది. దీని అర్థం.. సమస్త మానవాళి రక్షణార్థం ఈ లోకానికి పంపబడిన క్రీస్తు.. దిగ్విజయంగా తన తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి లోకానికి రక్షణను ప్రసాదించి తన ఆత్మను యహోవాకు అప్పగించుకున్నాడని.