దారుణం: కర్ణాటకలో పరువు హత్య! కూతురు, అల్లుడిని కత్తులతో పొడిచి చంపి.. నదిలో పడేసిన తల్లిదండ్రులు!

young couple honor killing by parents in karnataka state
- Advertisement -

young couple honor killing by parents in karnataka state

బెంగళూరు: కులాంతర వివాహం చేసుకుని తమ పరువు మొత్తం తీసిందనే భావనతో ఆ తల్లిదండ్రులు తమ కూతురితో పాటు అల్లుడిని కూడా కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం కాళ్లు చేతులు కట్టేసి వారిద్దరి మృతదేహాలను నదిలో పడేశారు. ఈ దారుణ పరువు హత్య కర్ణాటకలోని హోసూరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… హోసూరు-బేరికె రహదారిలోని వెంకటేశపురం చూడగొండపల్లి గ్రామానికి చెందిన నందీశ్ (25) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో  ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన స్వాతి (21)తో అతనికి పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు.

ఇదే విషయాన్ని నందీశ్, స్వాతి తమ తమ ఇళ్లలో తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో స్వాతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా స్వాతి మూడు నెలల క్రితం నందీశ్‌ను పెళ్లి చేసుకుంది.

కూతురు చేసిన పనితో తీవ్ర ఆగ్రహానికిలోనై…

కూతురు చేసిన పనితో తీవ్ర ఆగ్రహానికిలోనైన స్వాతి తండ్రితోపాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఆమెను చంపేయాలని ప్రణాళిక వేశారు. ఈ నేపథ్యంలో నందీశ్, స్వాతి ఇద్దరూ ఉన్నట్లుండి అదృశ్యం అయ్యారు.

దీంతో అనుమానం వచ్చిన నందీశ్ సోదరుడు పోలీసులను పిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు మాండ్య జిల్లా మల్లహళ్ళి శివారులోని కావేరి నదిలో విగతజీవులుగా ఉన్న ఓ జంటను గుర్తించారు.

ఆ మృతదేహాలు కనిపించకుండా పోయిన నందీశ్, స్వాతివేనని పోలీస్ అధికారులు నిర్ధారించారు. వీరి ఇద్దరిని కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసి అనంతరం మృతదేహాలు దొరక్కుండా నదిలో పడేశారని తెలిపారు.

ఈ జంట హత్యల నేపథ్యంలో యువతి తండ్రితో సహా ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ హత్యకు కుట్ర పన్ని పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -