న్యూఢిల్లీ: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాల కారణంగా ఓ నవవధువు అత్యాచారానికి గురైంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే,.. కురుక్షేత్రలోని బాబైన్ కు చెందిన 22 ఏళ్ల అమ్మాయికి సెప్టెంబర్ 12న ఓ వ్యక్తితో పెళ్లి అయింది. 13వ తేదీన శోభనానికి ముహుర్తం పెట్టారు.
శోభనం రాత్రి గదిలోకి వెళ్లిన ఆ అమ్మాయికి ఆమె భర్త పాలలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ అమ్మాయి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె భర్త, అతని తండ్రి, భర్త సోదరుడు, సోదరి భర్త, మరో నలుగుగు తాంత్రికులు కలిసి ఆ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
నిజానికి సెప్టెంబర్ 14న కొన్ని పూజలను నిర్వహించేందుకు ఆమె భర్త తాంత్రికులను పిలిపించాడు. పూజల తర్వాత ఆ అమ్మాయిని బలి ఇవ్వాలనేది వాళ్ల ప్లాన్. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమెకు జరిగిన విషయం అంతా అర్థమైంది. ఘటనపై ఆమె వాళ్ళని నిలదీయగా… విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భర్త బంధువులు బెదిరించారు.
అయినప్పటికీ జరిగిన దారుణాన్ని ఆమె తన తండ్రితో చెప్పింది. దీంతో ఆమె తండ్రి కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. బాధితురాలి వద్ద నుంచి అవసరమైన నమూనాలను సేకరించామని, నివేదిక రాగానే భర్తతో పాటు ఆమె బంధువులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్కడ నుంచి ఆ కేసు కురుక్షేత్ర మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయిందనీ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని స్టేషన్ ఆఫీసర్ శీలవంతి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. కానీ ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. కాగా, ఆ అమ్మాయిపై ఈ అఘాయిత్యం జరగడానికి తాంత్రిక పూజల కోసం వచ్చిన నలుగురు దుండగులతో పాటు ఆమె అత్తామామలు, ఆడపడుచులే ముఖ్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు.