బెంగళూరు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. బెంగళూరులోని విద్యారణ్యపుర ప్రాంతంలోని ఒక ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అక్కడికి చేరుకుని.. ఆ ఇంటి తలుపులు బద్దలుకొట్టి చూడగా.. ఇంట్లో నివసిస్తున్న సుధారాణి (29) అనే మహిళ, ఆమె కుమార్తె సోనికా(6), తల్లిదండ్రులు జనార్థన్ (52), సుమిత్ర (45) విగత జీవులుగా పడి కనిపించారు.
స్థానికుల కథనం ప్రకారం.. జనార్థన్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. దాదాపు ఏడేళ్ల క్రితం కుమార్తె సుధారాణికి అర్జున్ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. అర్జున్ మెడికల్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు.
వీరి మృతిపై సుధారాణి భర్త అర్జున్‌ని పోలీసులు విచారించాగా.. తన భార్య పుట్టింటికి వెళతాను అని చెప్పి పాపను తీసుకొని వెళ్లిందని.. ఇప్పుడు ఇలా వారి చావు వార్త వింటున్నాను అంటూ అతడు కన్నీరుమున్నీరయ్యాడు.
అయితే.. వారి మృతదేహాల వద్ద ఓ సూసైడ్ నోట్ కూడా కనపడింది. ఆ సూసైడ్ నోట్ లో ‘కొత్త ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తికి 25 లక్షల రూపాయలు ఇచ్చాను. అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నా డబ్బులు అన్ని పోయాయి..’’ అంటూ సుధారాణి రాసినట్లుగా ఉంది.
ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పొలీసులు.. ఆ నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.