ఆసక్తికరం: ఆ 12 సీట్లు పెండింగ్ పెట్టడంలో కేసీఆర్ వ్యూహం?

cm-kcr
- Advertisement -

kcr strategy oppositios strategy that why 12 seats are pending

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహలు పన్నుతూ అదికార ప్ర‌తిప‌క్ష నేత‌లు ముంద‌స్తు ఎన్నిక‌ల్లో దూసుకెళ్తున్నారు.

మరోవైపు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఏర్పడిన మ‌హాకూట‌మిలో లుకలుకలు తగ్గడం లేదు.  కూటమిలో నేత‌ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క.. ఆయా పార్టీల అభ్య‌ర్థుల ప్రకటనలోనూ విపరీత జాప్యం చోటుచేసుకుంటోంది.  కాంగ్రెస్, టీ-టీడీపీ, సీపీఐ ఇప్పటికే తొలివిడత జాబితాలు ప్రకటించినా ఇంకా చాలా సీట్లు పెండింగులో పెట్టేశాయి.

రాజ‌కీయ వ్యూహమే…

స్థానాలు, అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌ట‌న‌ల తాత్సారం వెన‌క రాజ‌కీయ వ్యూహం ఉంద‌ని కూట‌మి నేత‌లు చెప్పుకొస్తున్నారు. మరోవైపు మహాకూట‌మి నేత‌ల వ్య‌వ‌హారం ఇటు అధికార పార్టీ నేత‌ల‌కు సైతం అగ్నిప‌రీక్ష‌గా త‌యార‌ైంది.  గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజునే 105 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి తన రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సంగతి తెలిసిందే.

కూటమికి దీటైన అభ్యర్థులను దించాలనే…

అయితే కేసీఆర్ కూడా మరో 12 స్థానాల‌ు పెండింగ్‌లో ఉంచారు. ఈ స్థానాల్లో మహాకూటమి ఎవరెవరిని ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలుపుతుందో చూసి, దానికి తగిన వ్యూహం రూపొందించుకోవాలని, ఆయా అభ్యర్థులకు దీటైన అభ్యర్థులను తమ పార్టీ నుంచి పోటీకి దించాలని ఆయన భావించారు.  అయితే మహాకూటమిలోని పార్టీలు తమ తమ అభ్యర్థుల ప్రకటనపై రోజుల తరబడి జాప్యం చేస్తుండడం టీఆర్ఎ‌స్‌కు శరాఘాతంగా పరిణమించింది.

టీఆర్ఎస్ భవన్‌లో మొన్న జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ ఇది వరకే ప్రకటించిన అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చే రోజున కూడా.. మళ్లీ మిగిలిన ఆ  12 సీట్లను ప‌క్క‌న పెట్టి మిగ‌తా అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అందించారు ఆప‌ద్ధర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్.

వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు..!

ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేష్ విడుదల కావడం, నామినేషన్ల ప్రక్రియ షురూ అవడంతో  ముందస్తు ఎన్నికలకు గడువు సమీపిస్తున్నందున పార్టీలన్నీ వేగం పెంచేస్తున్నాయి. ఒక్క మహాకూటమి మినహా రాష్ట్రంలోని పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారం నిర్వహించడం చేస్తున్నాయి.

ఇన్నాళ్లూ సీట్లు, అభ్యర్థుల ఎంపిక విషయంలో చర్చల మీద చర్చలు జరుపుతూ నాన్చిన కాంగ్రెస్ సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో తన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేసింది. దీంతో అటు టీ-టీడీపీ కూడా తన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది.  మరోవైపు సీపీఐ కూడా ఇప్పటికే తన స్థానాలు, అభ్యర్థులను ప్రకటించింది.  ఈ నేపథ్యంలో నేడో రేపో ఆ 12 మంది అభ్య‌ర్థుల‌ను కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.

నిజానికి అభ్యర్థుల ప్రకటనలో తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీలకంటే ముందుందనే చెప్పాలి. ప్రతిపక్షాలు ఇంకా సీట్లపై సిగపట్లు పడుతున్న వేళ.. అధికార పార్టీ ఏకంగా అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి తన సత్తా ఏమిటో తెలియజేసింది. అంతేకాదు, టీఆర్ఎస్ అభ్యర్థులు అప్పుడే ప్రచారంలోకి దిగిపోయారు. కొద్దిరోజుల క్రితం గులాబీ పార్టీ అధినేత.. మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.

అస‌మ్మ‌తి తగ్గాకే ప్రకటన.!

105 మంది అభ్యర్థులను ప్రకటించి మరో 12 స్థానాలను పెండింగ్‌లో పెట్టారు కేసీఆర్. ఈ జాబితాను ఎప్పుడు వెల్లడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి మొన్న ఆదివారమే ఇదివరకు ప్రకటించిన 107 మందిసహా మిగిలిన 12 మంది అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించి, అందరికీ కలిపి బీ-ఫారాలు పంపిణీ చేయనున్నారని వార్తలు వచ్చాయి.

అయితే, అనూహ్యంగా 107 మందికే బీ-ఫారాలు అందించి, ఆ 12 స్థానాలను అలాగే సస్పెన్స్‌లో ఉంచారు గులాబీ అధినేత. అయితే మరోవైపు కేసీఆర్ తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచి టీఆర్ఎస్‌లో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఇతర నేతలు మంతనాలు జరిపినప్పటికీ ఇంకా అసమ్మతి చల్లారలేదు.

స్వయంగా కేసీఆరే కొంత మందితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో మాత్రమే కాదు, పెండింగ్‌లో ఉంచిన చోట్ల కూడా ఇదే తరహా పరిస్థితి ఉంది. అందుకే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలోని అసమ్మతి చల్లారకే ఆ మిగిలిన 12 స్థానాలను టీఆర్ఎస్ అధినేత ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు, మహాకూటమి అభ్యర్థులను ప్రకటన కోసమే వేచి చూస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ, అభ్యర్థుల ప్రకటన ఎంత ఆలస్యమైతే అంత నష్టమనే చ‌ర్చ మాత్రం జ‌రుగుతోంది.

ఆ 12 స్థానాల్లోనూ ఖరారైన అభ్యర్థులు, ప్రకటనే తరువాయి…

ఇదిలా ఉండగా, టీఆర్ఎస్‌లో మిగిలిన 12 స్థానాల్లో కూడా అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది.

ఖైరతాబాద్‌- దానం నాగేందర్,
గోషామహల్‌- ప్రేమ్‌సింగ్‌ రాథోడ్,
ముషీరాబాద్‌- ముఠా గోపాల్,
అంబర్‌పేట- కాలేరు వెంకటేశ్,
మేడ్చల్‌- ఎంపీ మల్లారెడ్డి,
మల్కాజ్‌గిరి- మైనంపల్లి హన్మంతరావు,
చొప్పదండి- సుంకె రవిశంకర్,
వరంగల్‌ తూర్పు- నన్నపునేని నరేందర్,
హుజూర్‌నగర్‌- శానంపూడి సైదిరెడ్డి,
కోదాడ- వేనేపల్లి చందర్‌రావు,
వికారాబాద్‌- టి.విజయ్‌కుమార్‌
చార్మినార్‌- దీపాంకర్‌పాల్‌

తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
అయితే, వీరిని ప్రకటించకపోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా..? లేక ఏదైనా సమస్య ఉందా..? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా మహాకూటమి అభ్యర్థుల ప్రకటన కూడా వెలువడింది కాబట్టి.. నేడో, రేపో కేసీఆర్ కూడా ఈ 12 స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

- Advertisement -