హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలోని 119 నియోజవర్గాలకు ఒకే విడతలో డిసెంబరు 7న పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభంకాగా, నవంబరు 19తో ముగిస్తుంది. అలాగే నవంబరు 20న నామినేషన్లను పరిశీలన, నవంబరు 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
డిసెంబరు 7న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, అయితే పాలు సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో…
కొన్ని ప్రాంతాలలో గతంలో జరిగిన సంఘటలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుందని ఈసీ తెలియజేసింది.
ఈ ప్రాంతాల్లో భద్రతపై ప్రధానంగా దృష్టిసారించిన పోలీసులు, భారీగా బలగాలను మొహరించాలని నిర్ణయించారు. సిర్పూర్, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, అసిఫాబాద్, మంథని, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో తొమ్మిది గంటలు మాత్రమే పోలింగ్ నిర్వహించగా మిగిలిన 106 స్థానాల్లో పది గంటలపాటు పోలింగ్ జరగనుంది.
అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలకు మించరాదు: ఈసీ
అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల ఖర్చు 28 లక్షల రూపాయలకు మించరాదని ఈసీ నిబంధన విధించింది. అంతేకాదు, పోటీ చేసే అభ్యర్థుల వద్దగాని లేదా వారి అనుచరులు వద్దగాని గరిష్టంగా 50 వేల రూపాయాలు మాత్రమే ఉండాలని, అంతకు మించి ఉంటే దానికి వారే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
అంతకు మించి డబ్బు దొరికినట్లయితే.. వారికి నోటీసులు జారీచేసి, వారిపై కేసు నమోదు చేస్తామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.