షాకింగ్: యూట్యూబ్‌లో వీడియో చూస్తూ గర్భిణికి డెలివరీ, ఏం జరిగిందంటే…

krithika
- Advertisement -

krithikaచెన్నై: యూట్యూబ్‌లో వీడియో చూస్తూ సహజ ప్రసవం కోసం ఓ దంపతులు చేసిన ప్రయత్నం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.  ఈ ఘటనలో పుట్టిన బిడ్డ క్షేమంగా ఉండగా, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మాత్రం అసువులు బాసింది.  ఈనెల 22న తమిళనాడులోని తిరువూర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరువూర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం…

జిల్లాలోని  పుదుపాలయంకు చెందిన కార్తికేయన్‌ భార్య కృతిక(28) అదే ప్రాంతంలోని ఓ ప్రవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి హిమాని అనే కుమార్తె ఉంది. వీరి పక్కనే నివసిస్తున్న లావణ్య, ప్రవీణ్‌ల జంటతో వీరు స్నేహంగా ఉండేవారు. ఇటీవలే లావణ్యకు ఇంట్లోనే సుఖ ప్రసవం జరిగి పాప పుట్టింది. ఆదినుంచీ కృతికకు పకృతి వైద్యంపై నమ్మకం ఎక్కువగా ఉండేది.

మరోమారు గర్భం దాల్చిన కృతిక.. లావణ్య మాదిరిగానే తాను కూడా తన బిడ్డకు సహజంగానే జన్మనివ్వాలని భావించింది. సహజ ప్రసవం కోసం ఆమె తన భర్త కార్తికేయన్‌ను కూడా ఒప్పించింది. దీనికోసం గర్భిణులకు ఎలా ప్రసవం చేయాలో యూట్యూబ్ వీడియోలు చూసి తెలుసుకున్నారు.  ఆదివారం కీర్తికకు పురిటి నొప్పులు రావడంతో.. లావణ్యకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకుని యూట్యూబ్‌ వీడియోల్లో మాదిరి సహజ ప్రసవానికి ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో పుట్టిన బిడ్డ సురక్షితంగా ఉన్నప్పటికీ.. కృతిక మాత్రం తీవ్ర రక్తప్రావానికి గురై అపస్మారక స్థితికి చేరుకుంది.  దీంతో చికిత్స కోసం వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా ఆమె మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లగా.. డెత్ సర్టిఫికెట్‌ లేకపోవడంతో అక్కడి సిబ్బంది అంత్యక్రియలకు అంగీకరించలేదు. ఈ ఘటనపై శశ్మాన సిబ్బంది అందించిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసుకున్నారు.

శవ పంచనామా అనంతరం కీర్తిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కృతిక మృతికి కారణమైన ఆమె భర్త కార్తికేయన్‌తో పాటు లావణ్య దంపతులను కూడా అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్య శాఖ అవగాహన లేకుండా ఎవరికి వారే సహజసిద్ధ వైద్య చికిత్సలు చేసుకోరాదంటూ ప్రజలను హెచ్చరించింది.

 

- Advertisement -