న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. ఈ శతాబ్ధంలోనే అత్యంత అరుదైన, సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి 10: 45 నిమిషాలకు మొదలైంది. దాదాపు 6 గంటలకుపైగా ఆకాశంలో కనువిందు చేయనున్న సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశంలో రాత్రి 11:45 గంటలకు సాక్షాత్కరించనుంది. దీనికితోడు ఇదేరోజు అంగారక గ్రహం(మార్స్) భూమికి చేరువగా రానుంది.
ప్రారంభం నుంచి చివరివరకు వివిధ ప్రక్రియలు కలిపి మొత్తం ఆరు గంటలపాటు గ్రహణం కొనసాగనున్నది. గ్రహణం మన దేశంలో శుక్రవారం(27వ తేదీ) రాత్రి 10:45 గంటలకు ప్రారంభమై శనివారం(28వ తేదీ) తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది. రాత్రి ఒంటి గంట నుంచి 2:43 గంటల మధ్య గ్రహణం ఉచ్ఛదశలో ఉంటుంది.
దేశంలో ఎక్కడి నుంచైనా…
మొత్తం 1:43 గంటలపాటు చంద్రుడు రుధిర వర్ణంలో కనిపిస్తాడు. అందుకే దీనిని ‘బ్లడ్ మూన్’గా కూడా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే తప్ప దేశంలో ఎక్కడి నుంచి చూసినా ఈ సంపూర్ణ గ్రహణం సాక్షాత్కరించనున్నది. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆకాశంలో అరుదైన ఈ దృశ్యాన్ని వీక్షించగలరని ఇప్పటికే శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల కంటే జమ్ముకశ్మీర్, తమిళనాడులో చంద్ర గ్రహణాన్ని, అంగారక గ్రహాన్ని మరింత స్పష్టంగా చూడొచ్చని వారు తెలిపారు.
గ్రహణంలో ప్రధాన దశలివే..
సంపూర్ణ చంద్ర గ్రహణంలో మొదటి దశ 10:45 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనిని ‘పెనంబ్రల్ ఫేజ్’ అంటారు. ఈ దశలో గ్రహణం లక్షణాలు కనిపించవు. రాత్రి 11:54 గంటలకు చంద్రుడిపై భూమి నీడ పడటం మొదలవుతుంది. దీనిని ‘అంబ్రల్ ఫేజ్’ అంటారు. ఈ దశలోనే రాత్రి ఒంటి గంట నుంచి 2:43 గంటల వరకు భూమి నీడ చంద్రుడిని పూర్తిగా ఆక్రమిస్తుంది. దీనిని ‘టోటాలిటీ ఫేజ్’ లేదా సంపూర్ణ దశ అంటారు. ఇది తెల్లవారుజామున 3:49 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఫేజ్ ముగిసే సమయానికి భూమి నీడ నుంచి చంద్రుడు బయటికి వచ్చేస్తాడు.
ఇప్పుడు మిస్సయితే…
ఎంతో అరుదైన ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్నిఇప్పుడు గనుక చూడలేకపోతే మళ్లీ 2025 సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందేనని ప్లానెటరీ సొసైటీ ఇండియాకు చెందిన రఘునందన్‌కుమార్ తెలిపారు. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదని, నేరుగా కళ్లతోనే చూడవచ్చని తెలిపారు.
ఈ నెల 31న…
బ్లడ్ మూన్ సందర్భంగా అంగారకుడు కూడా భూమి సమీపంలోకి వస్తుండటంతో శుక్రవారం రాత్రి ఆకాశంలో చంద్రుడితోపాటు మార్స్ ప్లానెట్ కూడా కనిపించనుంది. నాలుగు రోజులపాటు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అంగారక గ్రహం కనిపిస్తుందని, ఈ గ్రహాన్ని నేరుగా కంటితో చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ నెల 31న ఈ గ్రహం భూమికి అత్యంత సమీపంలోకి వస్తుందట, ఆ రోజు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందట.
ఆలయాలు మూసివేత…
సంపూర్ణ చంద్ర గ్రహణం నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూసివేశారు. చంద్ర గ్రహణం పూర్తయిన తర్వాత తిరిగి ఈ ఆలయాలను సంప్రోక్షణం చేసి తెరుస్తారు.
ఆ సమయాలివే…
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయం – శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి శనివారం ఉదయం 3.45 నిమిషాల వరకు.
బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం – శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటల నుంచి శనివారం ఉదయం 5.15 గంటల వరకు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం – శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి శనివారం తెల్లవారు జామున 4.30 గంటల వరకు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం – శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి శనివారం ఉదయం వరకు.
శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జునస్వామి ఆలయం – శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి శనివారం ఉదయం వరకు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం – శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం ఉదయం 4.15 గంటల వరకు.