ఖాజీపేట: తమ కోడలిని పుట్టింటికి తీసుకెళ్లి 45 రోజులైనా ఆమెను తిరిగి తీసుకురాకపోవడంతో.. అత్తింటి వారికి అనుమానం వచ్చింది. అసలు వారు తమ స్వగ్రామానికి చేరారా లేదా అనే అనుమానం వచ్చిన అత్తింటి వారు చేసిన ఫిర్యాదుతో.. కేసు విచారించిన పోలీసులు నివ్వెరపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట ప్రాంతానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే యువకునికి ప్రకాశం జిల్లా మోదినీపురానికి చెందిన మౌనికతో 3 నెలల క్రితం వివాహమైంది. భార్యా భర్తలు ఇద్దరు అన్యోన్యంగానే కాపురం చేసుకుంటున్నారు.
కొద్ది రోజులు పుట్టింటికి తీసుకెళతానని…
ఇంతలో మౌనిక తండ్రి అనంత రెడ్డి ఆగస్టు 25న ఖాజీపేటకు వచ్చి, తన కుమార్తెను కొద్ది రోజులు పుట్టింటికి తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తానని చెప్పడంతో.. రామకృష్ణారెడ్డే స్వయంగా బస్టాండ్‌కు వచ్చి వాళ్ళను బస్సు ఎక్కించాడు.
కానీ వాళ్ళు ప్రకాశం జిల్లాలోని పుట్టింటికి వెళ్లనూలేదు, అలాగని అత్తింటికి తిరిగి రానూలేదు. ఈ క్రమంలో మౌనిక పుట్టింటికి వెళ్ళి దాదాపు నెలన్నర అయినా మెట్టినింటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె భర్త రామకృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. విషయంపై పోలీసులు కేసు నమోదు కేసుకుని విచారణ చేపట్టారు.
పెళ్లి చేసుకోవడం, పరారవడం మామూలే…
కేసు విచారణ నిమిత్తం మౌనిక స్వగ్రామానికి వెళ్లగా, పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. మౌనిక గతంలోనూ కొంత మందిని వివాహం చేసుకుందని, పెళ్ళి అయిన కొద్ది కాలం తరువాత అత్తింటి నుంచి డబ్బు, బంగారంతో పరారవుతుందని పోలీసులు తెలుసుకున్నారు.
మరోవైపు మౌనిక కనిపించకపోయినా ఆమె కుటుంబ సభ్యులు కనీసం ఫిర్యాదు చేయకపోవడం కూడా పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో మౌనిక పుట్టింటి వారి బాగోతం బట్టబయలైంది. తమది పేద కుటుంబమని, కట్న కానుకలు ఇచ్చుకోలేమని అబ్బాయి తరుపు వాళ్లను నమ్మించి.. పెళ్ళిలో అత్తింటి వారితోనే బంగారం గట్రా పెట్టించుకుంటుంటారు.
ఆపైన కొన్ని రోజులు కాపురం చేసిన మౌనిక ఆ బంగారు ఆభరణాలతో ఉడాయిస్తుందని, ఇందుకు ఆమె పుట్టింటివారు కూడా తోడ్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మౌనిక వాడుతున్న ఫోన్ నంబర్ ఆధారంగా ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న పోలీసులు చెప్పారు. అయితే ఈ కథనంలో నిజమెంతో మౌనిక దొరికితేగాని తెలియదు.