కొలిక్కిరాని మహాకుటమి సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ తీవ్ర అసహనం, కూటమి చీలిపోకుండా చూసుకోమని ఉత్తమ్‌కు హితవు…

rahul gandhi angry for telangana mahakutami seats not sets
- Advertisement -

rahul gandhi angry for telangana mahakutami seats not sets

హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయమై ఒక స్పష్టత రాకపోవడంపై అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం.

తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లున్నాయి.  74 సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ, మిత్రపక్షాల సీట్ల సర్దుబాటు విషయం స్పష్టం కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయమై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా.. సోమవారం ఢిల్లీకి వెళ్లి మధ్యహ్నం 12 గంటల సమయంలో రాహుల్‌‌ భేటీ అయి పరిస్థితిని వివరించారు.

ఆదివారం సాయంత్రమే చర్చ…

అలాగే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రమే టీజేఎస్ చీఫ్ కోదండరామ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణలతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహాకూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై చర్చ జరిగింది.

టీడీపీకి 14 సీట్లు, టీజేఎస్‌‌కు 8 సీట్లు, సీపీఐకు 3 సీట్లును, తెలంగాణ ఇంటి పార్టీకి 1 సీటును కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే ఏఏ స్థానాలను మిత్రపక్షాలను కేటాయించాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.  వరంగల్ ఈస్ట్, స్టేషన్‌ఘన్‌పూర్, సిద్దిపేట,వర్ధన్నపేట,మల్కాజిగిరి,రామగుండం, సికింద్రాబాద్, మెదక్, చాంద్రాయణగుట్ట సీట్లను టీజేఎస్ కోరింది. కానీ నాలుగు సీట్ల విషయంలో మాత్రమే కాంగ్రెస్, టీజేఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

5 స్థానాలకు సీపీఐ పట్టు…

అయితే సీపీఐ మాత్రం తమకు కనీసం 5 స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ ఐదు స్థానాలను ఇదివరకే ప్రకటించిన సీపీఐ త్వరలోనే అభ్యర్థులను కూడ ప్రకటించనున్నట్టు పేర్కొంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీనివాసన్, రాష్ట్ర నేత గూడూరు నారాయణరెడ్డి ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో చర్చించారు. కొత్తగూడెం, బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ సీట్లను సీపీఐ కోరుతోంది. కొత్తగూడెం మినహా మిగిలిన మూడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది. కొత్తగూడెం సీటు ఇవ్వనిపక్షంలో అసలు పొత్తులు అవసరమే లేదని సీపీఐ బెదిరిస్తోంది.

ఈ పరిస్థితులన్నింటినీ సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీకి.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అయితే కూటమి నుండి ఏ పార్టీ కూడ బయటకు వెళ్లకుండా చూడాలని రాహుల్ టీపీసీసీ చీఫ్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

- Advertisement -