
కర్నూలు: ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడతాయనే తరుణంలో….కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడు, టీడీపీ నేత శేఖర్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
కర్నూలు జిల్లా డోన్ మండలం, తాపలకొత్తూరులో శేఖర్ రెడ్డి బైక్ ను అడ్డగించిన దుండగులు రాడ్లు, కర్రలతో దాడిచేశారు. అనంతరం రక్తపు మడుగుల్లో కోన ఊపిరితో కొట్టుకుంటున్న శేఖర్ తలపై బండరాయితో మోదారు. దీంతో తీవ్రరక్తస్రావం అయిన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
హత్య చేసిన వెంటనే దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఇక శేఖరరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు శేఖర్ రెడ్డి భౌతికకాయాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. నిందితులని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలని రంగంలోకి దించాయి.
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒక్కరోజు ముందు ఈ హత్య చోటుచేసుకోవడంతో కర్నూలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే భూ తగాదాలే శేఖర్ రెడ్డిపై దాడికి కారణంగా తెలుస్తోంది.








