భలే కి‘లేడీలు’: మేకప్ వేయాలన్నారు.. మత్తు బిళ్లలు ఇచ్చి మొత్తం దోచేశారు!

- Advertisement -

హైదరాబాద్: ఇద్దరు మహిళలు మరో మహిళను తేలిగ్గా బురిడీ కొట్టించి ఉన్నదంతా దోచుకున్నారు.  ఈ ఘటన  హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీ 6వ ఫేజ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చందానగర్‌లో నివాసం ఉంటున్న జ్యోతి మంగేశ్వరి (47) కేపీహెచ్‌బీ కాలనీలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది.

మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఓ మహిళ మరో యువతి కలిసి బ్యూటీ పార్లర్‌కు వచ్చారు. తమ ఇంట్లో పెళ్లి ఉందని, పెళ్లికూతురు మేకప్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చామన్నారు.  ముందు తమ ఇద్దరిలో ఒకరికి మేకప్ వేసి చూపించాలని, నచ్చితే కాంట్రాక్ట్ మీకేనంటూ నమ్మబలికారు.

తీరా మేకప్ వేసే సమయంలో ఒంటిపై ఆభరణాలు ఉండరాదని షరతు పెట్టారు.  వారి మాటలను నమ్మిన మంగేశ్వరి తన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, నాలుగు ఉంగరాలు, నాలుగు చేతి గాజులు తీసి బీరువాలో భద్రపరిచి మేకప్ వేయడం మొదలుపెట్టింది.  ఆ తర్వాత ఆమెను మాయమాటల్లో పెట్టిన ఇద్దరు కిలేడీలు… పిప్పరమెంట్ బిళ్లలని నమ్మబలికి ఆమె చేత మత్తు బిళ్లలను తినిపించారు.

మంగేశ్వరి  ఆ మత్తు బిళ్లలను తిని మత్తులోకి జారుకోగానే బీరువాలో ఆమె భద్రపరిచిన నగలను కొట్టేసి ఇద్దరూ పరారయ్యారు. కాసేపటికి మెలుకువ వచ్చిన మంగేశ్వరి బీరువాలో నగలు కనిపించకపోవడంతో  మోసపోయానని గ్రహించి వెంటనేే పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -