హైదరాబాద్/తిరువనంతపురం: కేరళను ‘నిఫా’ వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలువురు అసువులుబాశారు. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ ‘నిఫా’ వైరస్ పక్క రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుండడం. ఇప్పటికే ఈ వైరస్ కర్ణాటకలోకి ప్రవేశించింది. అక్కడ ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వైరస్ మరింతమందికి సోకవచ్చనే అనుమానాల నేపథ్యంలో కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తున్నారు.
ఎవరికైనా జ్వరం వచ్చి.. నాలుగైదు రోజులుగా తగ్గకుంటే.. వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ‘నిఫా’ వైరస్ గురించి ఎటువంటి ఆందోళన చెందనక్కర్లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా వ్యాఖ్యానించారు. వైరస్ లక్షణాలు కనిపించగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు.
ఇక కేరళ ప్రభుత్వమైతే ఈ ‘నిఫా’ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్లవద్దని సూచించింది. ముఖ్యంగా కోజికోడ్, మలప్పురం, వేనాడ్, కన్నూర్ జిల్లాలకు వెళ్లవద్దని సూచనలు చేసింది. అంతేకాదు, ఈ ‘నిఫా’ వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం కోజికోడ్‌లో మే 25న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది.