యాసిడ్‌ పోస్తానని బెదిరించి.. యువతిని అపహరించిన యువకుడు, తర్వాత ఏం జరిగిందంటే…

girl kidnap
- Advertisement -

girl kidnapహైదరాబాద్: యాసిడ్‌ పోస్తానని బెదిరించి ఓ యువతిని కిడ్నాప్‌ చేసిన ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్‌ సమీపంలో నివసించే యువతి (21) బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని ఓ సంస్థలో కొన్నేళ్లుగా పని చేస్తోంది. స్థానికంగా నివసించే నిఖిల్‌ అనే యువకుడు తెలంగాణ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు.

వీరిద్దరి మధ్య మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నారు.  ఈ క్రమంలో అ విషయం అ యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు నిఖిల్‌ను మందలించి, ఇంకెప్పుడు తమ కుమార్తె జోలికి రావొద్దంటూ హెచ్చరించారు. తల్లిదంద్రులు మందలించడంతో అ యువతి సైతం నిఖిల్‌ను దూరం పెట్టింది.

మాట్లాడాలని పిలిచి…

ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆ యువతి మాదాపూర్‌లో ఉంటున్న బంధువుల ఇంటి నుంచి తన కార్యాలయానికి వచ్చి వెళ్తోంది. అయితే గురువారం తనతో మాట్లాడే పని ఉందని చెప్పి నిఖిల్‌ ఆమెను కార్యాలయం నుంచి రావాలని కోరాడు. ఆమె రాగానే తనతో తెచ్చుకున్న యాసిడ్‌ సీసా చూపి బెదిరించి తన వాహనం ఎక్కించుకున్నాడు. అతడు ఆమెను ఎల్బీనగర్‌ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

గుడికి వెళ్ళి ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో భయపడిన ఆ యువతి కేకలు వేసింది. వెంటనే స్థానికులు వారి వద్దకు వస్తుండగా నిఖిల్‌ యువతిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ సంఘటనపై ఈ యువతి గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిఖిల్‌పై కిడ్నాప్‌, బెదిరింపుల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -