చిత్తూరు: కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. కారణం.. ఆమె వివాహేతర సంబంధానికి అతడు అడ్డుపడడమే. అంతేకాదు, ఆ నేరం తనమీదికి రాకుండా ఉండేందుకు నాటకం ఆడింది. తన భర్త కనిపించడం లేదంటూ కేసు కూడా పెట్టింది. చివరికి పోలీసులు ఐదు నెలల తర్వాత ఈ కేసులో మిస్టరీని ఛేదించారు. దీంతో భయపడిన ఆమె లొంగిపోయింది.
ములకలచెరువు సీఐ శ్రీనివాసుల కథనం ప్రకారం… తంబళ్లపల్లె మండలం కోటకొండ గ్రామ పంచాయితీ ఎగువతండాకు చెందిన రమణమ్మ(45)కు, అదే గ్రామ పంచాయితీ బందార్లపల్లెకు చెందిన మదన్‌మోహన్‌రెడ్డితో వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ క్రమంలో విషయం రమణమ్మ భర్త బుక్యా మారూనాయక్ (60)కు తెలిసింది.
దీంతో అతడు భార్యను మందలించాడు. అయినా ఆమె తన ప్రవర్తనను మార్చుకోకపోగా, తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్న తన భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది మే 25న ఇంటిలో మద్యం తాగుతున్న బుక్యా మారూనాయక్‌తో గొడవపడింది. ఈ విషయమై ఇద్దరూ పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లారు.
పథకం ప్రకారం..
ఆ మర్నాడే (మే 26వ తేదీ) కోటకొండ ఎగువ తండాలో జాతర సందర్భంగా మారునాయక్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ముందే ఓ పథకం ప్రకారం.. ఇంటిలో ఉన్న గడువు తీరిన పలు రకాల టాబ్లైట్‌లను పొడి చేసి.. దానిని మద్యంలో కలిపి రమణమ్మ భర్తతో తాగించింది. ఆ తరువాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే అతన్ని చంపేసి ఆ విషయాన్ని ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌లో తెలిపింది.
అప్పటికే రమణమ్మ చిన్నప్పరెడ్డిగారి పల్లెకు చెందిన సుబ్బారెడ్డికి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు సహకరించింది. ఆ సహయానికిగాను తన భర్త మృతదేహన్ని మాయం చేయడానికి సుబ్బారెడ్డి సహకారం కోరింది రమణమ్మ.
దీంతో ఆమె ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి ఇద్దరూ తండాకు చేరుకుని అర్ధరాత్రి సమయంలో బుక్యా మారూనాయక్ మృతదేహాన్ని సంచిలో మూట కట్టి ట్రాక్టర్‌లో తీసుకెళ్లి రేణిమాకులపల్లె పంచాయతీ జోగువానిబురుజు సమీపంలోని ఈదలవంక వాగులో పాతిపెట్టారు.
ఏమీ ఎరగనిదానిలా…
మూడ్రోజుల తరువాత.. మే 29న తేదీన రమణమ్మ తన కొడుకు హరినాయక్‌తో కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త మారూనాయక్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని అనుమానితులను విచారించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది.
దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ శివకుమార్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. రమణమ్మ ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టి వాటి ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆమె భర్త బుక్యా మారూనాయక్ అదృశ్యం కాలేదని, రమణమ్మే మట్టుబెట్టిందని నిర్ధారణకు వచ్చారు. తన గుట్టు పోలీసులు తెలుసుకున్నరని పసిగట్టిన రమణమ్మ పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఆదివారం ఆర్‌ఐ బాలాజీ వద్దకు వచ్చి లొంగిపోయింది.
ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆదివారం సాయంత్రం తంబళ్లపల్లె గ్యాస్ గోడౌన్ వద్ద ఉన్న మదన్‌మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డిలను కూడా అరెస్ట్ చేశారు. వీరిందరినీ సోమవారం కోర్టులో హాజరుపరిచారు.
మారూనాయక్ మృతదేహానికి సంఘటన స్థలంలోనే తహసీల్దార్ సురేష్‌బాబు సమక్షంలో సోమవారం మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వైద్యులు రామచంద్రప్రసాద్‌రావు పోస్టుమార్టం నిర్వహించారు. ములకలచెరువు ఎస్‌ఐ ఈశ్వరయ్య, పెద్దతిప్పసముద్రం ఎస్‌ఐ రవికుమార్ కూడా ఉన్నారు.
ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో.. నిందితుల కాల్ డేటా సేకరించేందుకు కృషి చేసిన ఐడీ పార్టీ పోలీసులు వెంకటేష్, సిరాజ్, శ్రీకాంత్‌ను అభినందించి వారికి నగదు రివార్డు కూడా అందజేశారు.