హైదరాబాద్: టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. తాను ఎన్నికల బరిలో లేనప్పటికీ మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
1994లో తొలిసారి జగిత్యాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎల్.రమణ గెలుపొందారు. అనంతరం అక్కడ నుంచి ఐదుసార్లు పోటీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమణ తాను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పడం గమనార్హం.
మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర…
తాజాగా తెలంగాణలో మహాకూటమి ఏర్పాటులోనూ ఎల్.రమణ కీలక పాత్ర పోషించారు. ఇలాంటి సమయంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హఠాత్తుగా ఇలాంటి సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఏదేమైనా త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి ఆయన తప్పుకున్నట్లే.
తాను పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ మహాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడతానని ఈ సందర్భంగా రమణ తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి తాను అండగా ఉంటానని చెప్పారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలకడమే తన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.