విశాఖపట్నం: అవి లాకర్లా.. లేక జ్యువెలరీ షాపులా… అంటూ ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) శరగడం వెంకటరావుకు సంబంధించిన బ్యాంక్ లాకర్లు అన్నీ ధగధగలాడే నెక్లెస్‌లు, గాజులు, చెవి రింగులు, ఉంగరాలు, హారం, గొలుసులు, ముక్కుపుడకలు, జడపాయలు, వడ్డాణం, దండ వంకీలు, ఇలా.. ఆభరణాల వెరైటీలతో నిండిపోయి కనిపించాయి.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులో ఇప్పటికే అరెస్టు అయిన వెంకటరావుకు సంబంధించిన లాకర్లను తాజగా తెరిచిన ఏసీబీ అధికారులు సైతం.. ఆ స్వర్ణ వైభవానికి నివ్వెరపోయారు.
ఆయనతోపాటు కుటుంబసభ్యులు, స్నేహితుల ఇళ్లపై గత శనివారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపి.. సుమారు రూ.30 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ఏసీబీ అధికారులు వెంకటరావుకు చెందిన బ్యాంకు లాకర్లలో సోదాలు చేశారు. విశాఖ మురళీనగర్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రెండు లాకర్లు, మర్రిపాలెం విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకులో ఒకటి, ఊర్వశి ఎస్‌బీఐ బ్రాంచిలో మరొకటి, అక్కయ్యపాలెం గౌరీ కో-ఆపరేటివ్ బ్యాంకులో ఇంకో లాకర్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
కిలోలకొద్దీ బంగారం, వెండి వస్తువులు…
వీటిలో ప్రస్తుతం మూడు లాకర్‌లను ఏసీబీ అధికారులు తెరిచారు. మూడు లాకర్‌లోనూ కిలోలకొద్దీ బంగారం, వెండి వస్తువులు ఉండడం చూసి ఏసీబీ అధికారులు షాక్‌కు గురి అయ్యారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని రెండు లాకర్లలో కలిపి 1.8 కిలోల బంగారం వస్తువులు, ఎస్‌బీఐ లాకర్‌లో 1.3 కిలోల బంగారం, 10 కిలోల వెండి వస్తువులు బయటపడ్డాయి.
మంగళవారం ఏఎంవీఐ వెంకటరావుకు చెందిన మిగిలిన రెండు లాకర్లను తెరిచే అవకాశం ఉంది. ఇవి మాత్రమే కాకుండా.. కరాసలో 400 గజాల ఖాళీ స్థలం, మరో రెండు ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు కూడా ఈ లాకర్లలో లభ్యమయ్యాయి. ఈ సోదాల్లో దాదాపు రూ.3 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు.