పరిగి: వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ నాయకుడు నారాయణ రెడ్డిని మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. పొలానికి వెళ్తున్న నారాయణరెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
నారాయణరెడ్డి గతంలో నార్‌మ్యాక్స్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సమయంలోనే నారాయణరెడ్డికి.. గ్రామంలోని కొంతమంది యువకులకు మధ్య గొడవలు జరిగాయి. అలాగే.. నారాయణ రెడ్డి వర్గానికి, గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి గత కొంత కాలంగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. గతంలో పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. ఇరువర్గాలపై పోలీసు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉలిక్కిపడిన సుల్తాన్‌పూర్…
టీఆర్‌ఎస్ నేత హత్యతో సుల్తాన్‌పూర్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నారాయణ రెడ్డిని.. అతని ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికితోడు నారాయణ రెడ్డికి చెందిన కొంతమంది అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో రెండు వర్గాల మధ్య వైరం మరింత పెరిగింది.
నారాయణ రెడ్డి హత్యతో సుల్తాన్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోపోద్రిక్తులైన ఆయన వర్గం వారు కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి గొడవలు జరుగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి… నిందితుల కోసం గాలిస్తున్నారు.