శబరిమల: అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఓ పక్క ఆందోళనలు జరుగుతుండగా.. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. శబరిమల అయ్యప్ప ఆలయం తరతరాలుగా తమదని, తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని, అలా జరగకపోయినట్లయితే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి సాధించి తీరుతామని కేరళకు చెందిన మాల ఆర్యులు డిమాండ్ చేస్తున్నారు.
శబరిమలలోని అయ్యప్ప ఆలయం ‘12 శతాబ్దాబ్దం వరకు మాల ఆర్యుల అధీనంలో ఉండేదని, దానిని 1800లో పండలం రాజ కుటుంబం ఆక్రమించుకుందని వారు చెబుతున్నారు. ఆలయంలోని పలు పురాతన దేవతా విగ్రహాలను తొలగించి వాటిని చుట్టు పక్కల అడవుల్లో పారేసి. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారట.
అడవుల్లో పడేసిన ఆ విగ్రహాలే…
కాలగమనంలో అలా అడవుల్లో పడేసిన విగ్రహాలు కరిమల, కొత్తకుతితార, నీలక్కల్, పొన్నంబాల్మేడు, తలపరమల అడవుల్లో దొరికాయి. 1904లో పండలం రాజు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజమన్ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారాట.
దీంతో అప్పటివరకు అయ్యప్ప స్వామికి ద్రవిడ పద్ధతిలో జరిగిన పూజాది కార్యక్రమాలను మార్చివేసి బ్రాహ్మణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. గతంలో అయ్యప్పకు పూజారులుగా వ్యవహరించిన మాల ఆర్యులు తేనెతో అభిషేకం చేసేవారు. కానీ బ్రాహ్మణ పూజారులు తేనె స్థానంలో పాలతో అభిషేకం చేయడం ప్రారంభించారు. 1950లో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఈ ఆలయ పాలనా బాధ్యతలను స్వీకరించింది.
ఈ క్రమంలో మాల ఆర్యులు తమ పూర్వీకులకు చెందిన శబరిమల ఆలయన్ని తిరిగి తమకు అప్పగించాలని ఐక్య మాల ఆర్య మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. పీకే సజీవ్ శబరిమల అయ్యప్ప ఆలయంపై విస్తృత పరిశోధనలు జరిపారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం…
‘‘మాకు ఈ ఆలయాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. ఆ తరువాత అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి న్యాయంగా మా హక్కులను సాధించుకుంటాం. ప్రస్తుతం అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం మా మంచికే జరిగిందేమో..’’ అని ఐక్య మాల ఆర్య మహా సభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్ చెప్పారు.
అంతేకాదు.. ‘‘ఇప్పుడు మా హక్కులను ఈ ప్రపంచానికి తెలిపే అవకాశం దొరికింది. మాకు ఆలయాన్ని అప్పగించినట్లయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తాం. మా గుండెలో నిండా గూడుకట్టుకొని ఉండే మా అయ్యప్ప మహిళల పట్ల ఎప్పుడూ వివక్షత చూపలేదు..’’ అని ఆయన వ్యాఖ్యానించారు.