గోనె సంచిలో గుర్తు తెలియని వ్యక్తి అస్థిపంజరం.. ఎవరిది? ఏం జరిగి ఉంటుంది??

Mogli village people found unknown skeleton in Adilabad District
- Advertisement -

Mogli village people found unknown skeleton in Adilabad District

నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలంలోని మొగ్లి గ్రామ శివారులో ఓ గోనె సంచిలో గుర్తు తెలియని వ్యక్తి అస్థి పంజరం కనిపించడం సంచలనం సృష్టించింది.  ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.  దీంతో ముథోల్‌ సీఐ శ్రీనివాస్‌ ఆ ప్రదేశానికి వెళ్లి ఆధారాల కోసం పరిశీలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. మొగ్లి గ్రామానికి చెందిన పశువుల కాపరులు కొందరు శనివారం పశువులను మేపేందుకు గ్రామ శివారు అటవీ ప్రాంతంలోకి  వెళుతుండగా, వారికి ఓ చోట గోనె సంచి కనిపించింది.  దాన్ని విప్పి చూడగా.. అందులో ఒక అస్థిపంజరం దర్శనమిచ్చింది.  దీంతో వారు భయపడి తిరిగి గ్రామంలోకి వచ్చారు.  ఈ వార్త గ్రామంలో గుప్పుమంది. విషయం పోలీసుల వరకు వెళ్లింది.

దీంతో పోలీసులు అస్థిపంజరం ఉన్న ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో మృతదేహన్ని తీసుకువచ్చి అక్కడ పడేసి వెళ్లిపోయి ఉంటారని, ఇది జరిగి కనీసం మూడు నెలలైనా అయి ఉంటుందని అస్థిపంజరం ఉన్న స్థితిని బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు.

మహారాష్ట్రలోని కుంబర్‌గావ్‌ వాసిగా అనుమానం...

గోనె సంచిలో దొరికిన ఆ అస్థిపంజరం మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా నాయేగావ్‌ తాలూకా కుంబర్‌గావ్‌ గ్రామానికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తిది అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  ఎందుకంటే, సంతోష్‌కు తానూరు మండలం మొగ్లి గ్రామానికి చెందిన రుక్మాణి బాయితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ.. రుక్మిణిబాయి మాత్రం గత ఏడాది కాలంగా మొగ్లి గ్రామంలోని పుట్టింటి వధ్దే ఉంటోంది. మూడు నెలల క్రితం సంతోష్‌ మొగ్లి గ్రామానికి వచ్చి తిరిగి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అయితే అప్పటి నుంచి సంతోష్‌ అచూకీ తెలియడం లేదు.

దీంతో అతడి కుటుంబ సభ్యులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని అస్థిపంజరాన్ని పరిశీలించారు.  బహుశా అది సంతోష్‌‌దే అయి ఉండొచ్చని  పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అస్థిపంజరాన్నిఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించాలని బాధిత కుటుంబ సభ్యులు కూడా  పోలీసులను కోరారు.  దీంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -