చెన్నై: ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించి తీరాల్సిందేనని బెదిరిస్తున్నారు. ఒకవైపు ప్రేమిస్తున్నా అంటూనే మరోవైపు దాడికి తెగబడుతున్నారు. మరి ఇదేం ప్రేమో! తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ప్రాంతంలో చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో రెచ్చిపోయిన ఓ ప్రేమోన్మాది, ఆమెపై కత్తితో దాడి చేశాడు.
అంతేకాదు, అతడి దాడికి అడ్డు వచ్చిన పాపానికి ఆ అమ్మాయి తమ్ముడిని కూడా పొడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసలేం జరిగిందంటే…
తిరునల్వేలి ప్రాంతానికి చెందిన ప్రియ (20) కాలేజీ చదువు తరువాత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఇసక్కి ముత్తు అనే కూలీ పని చేసుకునే వ్యక్తి, ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతుండేవాడు. అతడి వేధింపులు భరించలేక ఈ ఏడాది జనవరిలో ప్రియ.. అతడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
అప్పటి నుంచి పరారీలో ఉన్న ఇసక్కి ముత్తు, ఇటీవల తిరిగి వచ్చి మళ్లీ యథాప్రకారం తన వేధింపులు ప్రారంభించాడు. తెల్లవారుజామున ప్రియ తల్లి మాలతి పాలు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లగా, ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న ప్రియను కత్తితో పొడిచాడు. ఆమె పెద్దగా అరవడంతో అక్కను కాపాడేందుకు ఆమె తమ్ముడు అడ్డురాగా, అతన్నీ పొడిచాడు.
వీరి అరుపులు విని స్థానికులు అక్కడికి రావడంతో ఇసక్కి ముత్తు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రగాయాల పాలైన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.