విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను గండం పొంచి వుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడటంతో కోస్తా ప్రాంతాలు వణికిపోతున్నాయి. దీనికి ‘‘గజ’’ తుఫానుగా వాతావరణ శాఖ నామకరణం చేసింది.
ఈ ‘గజ’ తుఫాను కారణంగా తీరం వెంబడి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచడంతోపాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్య్సకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.
అలాగే కృష్ణపట్నంలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. ఈ నెల 15న నాగపట్నం-కడలూరు తీరాల మధ్య ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉందని.. ‘గజ’ తుపాను నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు.
నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 1180 కి.మీ దూరంలో…
ప్రస్తుతం ‘గజ’ తుపాను నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 1180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో.. తమిళనాడు దక్షిణ కోస్తాతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
‘గజ’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. అమరావతిలోని కమాండ్ కంట్రోల్ నుంచి ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే తుపాను ప్రభావిత జిల్లాల్లో మండలానికో ప్రత్యేక అధికారిని నియమించారు.
ముందు జాగ్రత్తగా విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కిరావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: విహారయాత్రలో విషాదం: విశాఖ యారాడ బీచ్‌లో ఆరుగురు గల్లంతు, కొనసాగుతున్న గాలింపు…
చదవండి: మళ్లీ ప్రజా సంకల్పయాత్ర: విజయనగరం చేరుకున్నజగన్.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు..