తంగడపల్లి వివాహిత హత్య కేసు.. నడుస్తున్న కారులో అత్యాచారం, హత్య!

- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద గత నెల 17న మహిళ మృతదేహం లభ్యమైన కేసుకు సంబంధించి తాజాగా విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఇద్దరు యువకులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు విచారణలో తేలింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో పథకం ప్రకారమే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసుల అదుపులో నిందితుడు…

ఈ హత్య కేసు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు గురైన మహిళకు వివాహమైంది. అయితే, పెళ్లికి ముందు నుంచే నిందితుడు (ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యక్తి)తో ఆమెకు లవ్ ఎఫైర్ ఉంది. 

చదవండి: ఊర్లో దింపుతానని కారు ఎక్కించుకుని అత్యాచారం.. రంగారెడ్డి జిల్లాలో దారుణం

పెళ్లి తర్వాత కూడా వారి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాయి. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని, దూరంగా వెళ్లిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఆమె పదేపదే నిందితుడిని ఒత్తిడి చేసింది.

ఎలాగైనా వదిలించుకోవాలని…

అయితే అప్పటికే మరో యువతికి దగ్గరైన నిందితుడు ఆ క్రమంలో ఈ వివాహితను దూరం పెట్టాడు. అయినప్పటికీ ఆమె నుంచి ఒత్తిడి ఆగకపోవడంతో ఆమెను హత్య చేసి వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు.

తన ప్లాన్ అమలులో భాగంగా లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామంటూ బాధితురాలిని నమ్మించి అద్దె కారులో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో నిందితుడు ( ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి) వీరి కారులో ఎక్కాడు. 

కారులోనే అత్యాచారం, హత్య…

ఆపైన కారులోనే అత్యాచారం చేశారు. అనంతరం ఆమె గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం తంగడపల్లి వంతెన వద్దకు చేరుకుని ఆమె మృతదేహంపై ఉన్న దుస్తులు తొలగించి కిందికి తీసుకొచ్చారు.

ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బండరాయితో ఆమె ముఖాన్ని ఛిద్రం చేశారు. ఆ తరువాత కూడా గంట సేపు అక్కడే ఉన్న నిందితులు రక్తం అంటిన ఆ బండరాయిని తమతోపాటు తీసుకెళ్లారు.

కీలకంగా మారిన కారు జీపీఎస్…

ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగి ఇంటర్‌చేంజ్ నుంచి ఔటర్ రింగురోడ్డు మీదికి చేరుకున్నారు. ప్రొద్దుటూరు వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కారు జీపీఎస్ కూడా కీలకంగా మారింది.

ఈ కేసులో తొలుత ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని తమదైన శైలిలో విచారించగా ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దొరికితే కేసు చిక్కుముడి పూర్తిగా వీడనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

- Advertisement -