హైదరాబాద్: కుటుంబ కలహాల కారణంగా పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి.. పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే తన కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల మేరకు.. యాప్రాల్‌కు చెందిన సయ్యద్ రెహమాన్‌కు, రసూల్ పురాకు చెందిన కౌసర్ బేగంకు 8 సంవత్సరాల క్రితం పెళ్ళి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కౌసర్ బేగం బేగంపేటలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది.
రెహమాన్ మద్యానికి బానిస కావడంతో కౌసర్ బేగం భర్తకు దూరంగా తన తల్లి ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఎనిమిది నెలలుగా భార్యిభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెహమాన్ ఇటీవల తాగడానికి డబ్బుల కోసం భార్య కౌసర్ బేగం వద్దకు వచ్చాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య మళ్ళీ గొడవ జరిగింది.
ఆ విషయమై బేగంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కౌసర్ బేగం తల్లిదండ్రులు, చెల్లితో కలిసి వచ్చింది. తనపై కేసు పెట్టారన్న కోపంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రెమహాన్.. అది పోలీస్ స్టేషన్ అన్న విచక్షణ కూాడా మరచి.. కత్తితో భార్య కౌసర్ బేగంపై దాడి చేశాడు.
ఈ క్రమంలో అతనికి అడ్డొచ్చిన కుటుంబ సభ్యులను కూడా కత్తితో గాయపర్చాడు. ఈ దాడిలో భార్య కౌపర్ బేగం, మరదలు షాకీర్ బేగం, అత్త మస్తాన్ బేగం, బంధువులు సర్ధార్ బేగం, సల్మాన్ ఖాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు.
నిందితుడు రెహమాన్‌ను ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం.. గాంధీ ఆసుపత్రికి తరలించారు