హైదరాబాద్: స్నేహితుడే కదా అని నమ్మినందుకు ఓ ప్రబుద్ధుడు ఓ యువతికి చుక్కలు చూపించాడు. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను సేకరించి.. వాటిని అశ్లీల ఫొటోలుగా మార్ఫింగ్ చేశాడు. ఆ తరువాత వాటితో ఫేస్‌బుక్ ఖాతాలను ఓపెన్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఉదంతం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతంలో ఉంటున్న మహ్మద్ మొయిజుద్దీన్(22)కు ఇటీవల ఫోన్‌లో ఓ యువతి పరిచయమైంది. దానిని స్నేహంగా మార్చి.. ఆ యువతి సోషల్ మీడియా అకౌంట్ల గురించి తెలుసుకున్న మొయిజుద్దీన్ ఆమె ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ తరువాత కొన్ని నగ్న చిత్రాలతో వాటిని మార్ఫింగ్ చేశాడు. అంతటితో ఊరుకోలేదు.. ఏకంగా ఆ యువతి ఫేస్‌బుక్ ఖాతాలోనే పోస్ట్ చేశాడు.
యువతి నగ్న చిత్రాలతో 7 ఫేస్‌బుక్ అకౌంట్లు…
దీంతో ఆ యువతి షాక్ తింది. అతడ్ని నిలదీసింది. అంతే అతడితో రాక్షసుడు నిద్ర లేచాడు. ‘ఇదొక్కటే కాదు.. ఇంకా నీ పేరు మీద 7 అకౌంట్లు ఉన్నాయి.. చూసుకో పో..’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఆ యువతి వెంటనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
ఈ ఘటనపై తొలుత కేసు నమోదు చేసిన అధికారులు, ముందుగా సదరు ఫేస్‌బుక్ అకౌంట్లను బ్లాక్ చేశారు. అనంతరం నిందితుడు మొయిజుద్దీన్ కదలికలపై నిఘా ఉంచి, కాలాపత్తర్ ప్రాంతంలో తిరుగుతుండగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించడంతో కోర్టు ముందు హాజరుపరిచి రిమాండుకు పంపించారు.