విశాల్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన నిర్మాతలు.. ఆఫీసుకు తాళం వేసి పోలీసులకు అప్పగింత

actor-vishal-office-locked
- Advertisement -

చెన్నై: ప్రముఖ నటుడు, తమిళ నిర్మాతల సంఘం (టీఎఫ్‌పీసీ) అధ్యక్షుడు విశాల్‌కు వ్యతిరేకంగా నిర్మాతలు ఒక్కటయ్యారు. ఆయన తీరును నిరసిస్తూ దాదాపు 50 మంది నిర్మాతలు ఆందోళనకు దిగారు. సంఘం భవనానికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌లో అప్పగించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

శుక్రవారం ఏకంగా 9 సినిమాలు విడుదల కానున్నాయి. ఒకే రోజు ఇన్ని సినిమాలు విడుదలైతే చిన్న సినిమాల సంగతేంటని ప్రశ్నిస్తూ నిర్మాతలు ఆందోళనకు దిగారు. విశాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాతల సంఘం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి అనంతరం తాళం వేసి పోలీసులకు అప్పగించారు.

మొదటి నుంచీ విమర్శలే..

నిజానికి 2017లో నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి విశాల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అతడి పనితీరుపై నిర్మాతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు విశాల్ వెన్నంటి ఉండి మద్దతుగా నిలిచిన అతడి స్నేహితులు ఆర్కే సురేశ్, ఉదయలు కూడా ఇప్పుడు విశాల్ వ్యతిరేక వర్గంలో చేరిపోవడం గమనార్హం.

విశాల్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఉదయ, ఎస్వీ శేఖర్, ఏఎల్ అళగప్పన్, జేకే రితేశ్ తదితులు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో కార్యాలయంలో విశాల్ లేకపోవడంతో కార్యదర్శి కదిరేశన్‌ను వారు దూషించినట్టు తెలుస్తోంది.

- Advertisement -