దారుణం: రూ.5 వేల స్మార్ట్‌ఫోన్ కోసం భార్యను హింసించి చంపిన భర్త!

- Advertisement -

కడప: ఐదు వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ కోసం భార్యను దారుణంగా హింసించి హతమార్చాడో కిరాతక భర్త. కడపలో జరిగిందీ ఘటన. స్థానికంగా నివసించే ముస్లిం యువకుడు మారుతి-చాందిని (22) భార్యభర్తలు. వీరికి వల్లీ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. చాందినీ ప్రస్తుతం గర్భవతి. దుకాణాల్లో సాంబ్రాణి పొగ వేసి జీవించే మారుతి పెళ్లి సమయంలో కట్న కానుకల కింద నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు.

వివాహం అయినప్పటి నుంచే అదనపు కట్నం కోసం భార్య చాందినిని మారుతి వేధించేవాడు. అతడికి తల్లిదండ్రులు, సోదరి తోడు కావడంతో చాందినికి వేధింపులు ఎక్కువయ్యాయి. గత రెండు వారాలుగా చాందినిపై మరింత కిరాతకంగా ప్రవర్తించారు. భార్య శరీరంపై మారుతి సిగరెట్ కాల్చి వాతలు పెట్టేవాడు.

తనకు టచ్ ఫోన్ కొనివ్వాలంటూ ఇటీవల భార్యను అడిగాడు. ఇంటికెళ్లి ఫోన్, డబ్బులు తీసుకురావాలని కోరాడు. అయితే, రోజులు గడుస్తున్నా ఆమె ఫోన్ కొనివ్వకపోవడంతో కక్ష పెంచుకున్న భర్త మారుతి శుక్రవారం రాత్రి ఆమెపై దాడిచేసి హత్య చేశాడు.

అనంతరం ఆమెను గదిలోనే ఉంచి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. ఉదయం రక్తపు మడుగులో పడి వున్న చాందినిని చూసిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -