అనంతపురం: తమకు ఇష్టం లేకుండానే ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుందనే కోపంతో కన్నకూతురని కూడా చూడకుండా తల్లిదండ్రులే హతమార్చిన దారుణ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో చోటు చేసుకొంది. మండల పరిధిలోని హెచ్చెల్సీ కాలువలో ఆదివారం ఓ బాలిక మృతదేహం కనిపించింది. ఈ మృతదేహం చెన్నంపల్లికి చెందిన హేమశ్రీ (16)దిగా పోలీసులు గుర్తించారు.
వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మోహన్‌రాజు, హేమశ్రీలు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం వీరిద్దరూ తిరుమలలో ప్రేమ వివాహం చేసుకొన్నారు. అనంతరం తిరిగి గ్రామానికి వచ్చారు. వేరే సామాజిక వర్గానికి చెందిన మోహన్ రాజుతో వివాహం చేసుకోవడం అసలు ఇష్టం లేని హేమశ్రీ తల్లిదండ్రులు తమ కూతురు గ్రామానికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్నారు.
కన్నకూతురని కూడా చూడకుండా…
ఆదివారం మోహన్‌రాజు ఇంటికి వెళ్లిన హేమశ్రీ తల్లిదండ్రులు.. విచక్షణ మరచి.. కన్నకూతురనే మమకారం కూడా లేకుండా ఆమెను బయటికి లాగి.. వీధుల్లో కొట్టుకుంటూ తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి నుండి హేమశ్రీ, ఆమె తల్లిదండ్రులు అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో హేమశ్రీ మృతదేహం హెచ్చెల్సీ కాలువలో దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది.
దీనిని పరువు హత్య భావించి మంగళవారం ఆమె తల్లిదండ్రులు ఎర్రమ్మ, నారాయణస్వామితో పాటు హేమశ్రీ బాబాయిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.