శబరిమల: తెరుచుకున్నఆలయం తలుపులు.. తీవ్ర ఉద్రిక్తత, లాఠీఛార్జ్…

sabarmila-security
- Advertisement -

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆలయంలోకి ప్రవేశిస్తామంటూ మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా.. వారిని బీజేపీ నేతలు, శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. కవర్ చేసేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులను సైతం పోలీసులు అడ్డుకున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పోలీసుల కట్టుదిట్ట భద్రత నడుమ ఎట్టకేలకు బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ క్యూ కట్టారు. అయితే క్యూలో మహిళా భక్తులు కనిపించడంతో వారిని బీజేపీ, శివసేన కార్యకర్తలు గుర్తించి బయటికి పంపివేయడం ప్రారంభించారు.

దీంతో కొందరు మహిళా భక్తులు ఎదురుతిరిగారు.  ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఆలయంలోకి వెళ్లి తీరుతామని హక్కుల నేత తృప్తిదేశాయ్ స్పష్టం చేశారు.  దీంతో మహిళా భక్తులు లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు బీజేపీ, శివనసేన కార్యకర్తలు కూడా ఆలయ పరిసర ప్రాంతంలోనే కాపుకాశారు.

మరోవైపు కేరళ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. తాము ఎలాంటి కేసులు వేయ్యబోమని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -