న్యూఢిల్లీ: #MeToo లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తనపై జర్నలిస్టు ప్రియా రమణి చేసిన ఆరోపణలు అవాస్తమని, తన ప్రతిష్టను దిగజర్చడానికే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ఇటీవల పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
‘#మీటూ’లో భాగంగా ఇటీవల కొంత మంది మహిళా జర్నలిస్టులు కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మహిళలను ఆయన చూసే విధానమే తేడాగా ఉంటుందని, ఆయన తమని లైంగికంగా వేధించారని ఆరోపించారు. అక్బర్ పని చేసిన మీడియా సంస్థలో చాలా మంది మహిళలు ఆయన నుంచి వేధింపులు ఎదుర్కొన్నారని తెలిపారు.
ప్రియా రమణికి మద్దుతుగా…
మరో వైపు ప్రియా రమణికి మద్దుతుగా ఏసియా ఏజ్ సంస్థకు చెందిన మరో 20 మంది మహిళా జర్నలిస్టులు ముందుకొచ్చారు. తమ వాదనలు కూడా వినాలని కోర్టును వారు కోరారు. కేంద్ర మంత్రి అక్బర్‌పై జర్నలిస్టు ప్రియా రమణి తొలిసారిగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన పేరును నేరుగా బయటపెట్టడకుండా ‘డియర్ మేల్ బాస్..’ అంటూ ‘టు ది హర్వే వైన్‌స్టీన్స్ ఆఫ్ ది వరల్డ్’ శీర్షికతో 2017లో ప్రియా రమణి వోగ్ పత్రికకు ఓ వార్తా కథనం రాశారు.
తాను రాసిన కథనాన్ని అక్టోబర్ 8న మళ్ళీ రీట్వీట్ చేస్తూ, అందులో వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ప్రస్తావించిన వ్యక్తి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ అని ఆమె వెల్లడించారు. అప్పటి నుంచి రాజకీయంగా #మీటూ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రియా రమణి ఆరోపణలు చేసిన తర్వాత మరో పది మంది మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్ తమను వేధించారంటూ ఆరోపణలు చేశారు.
పదవికి అక్బర్ రాజీనామా…
‘‘నా మీద, నా వ్యక్తిత్వం మీద వచ్చిన తప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలను సవాలు చేస్తూ నేను న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించాను. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. దేశానికి సేవ చేసేందుకు నాకీ అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను..’’ అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్‌పై చత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా కార్యకర్త లైంగిక ఆరోపణలు చేయడంతో ఆయన వెంటనే రాజీనామా చేశాడు. దీంతో ఎంజే అక్బర్ కూడా లైంగిక ఆరోపణలపై బాధ్యతాయుతంగా స్పందించి రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరగడంతో అక్బర్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎట్టకేలకు ఎంజే అక్బర్ రాజీనామా చేయడంతో బీజేపీ నేతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
#MJAkbar resigns from his post of Minister of State External Affairs MEA. pic.twitter.com/dxf4EtFl5P
— ANI (@ANI) October 17, 2018