గురుగ్రామ్: వివాహమైన వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అతడిని రహస్యంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా, అతడి చేతే అతడి భార్యను హత్య చేయించింది. ఈ దారుణ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. గురుగ్రామ్ వ్యాలీ వ్యూ ఎస్టేట్ అపార్ట్‌మెంట్‌లో విక్రమ్ సింగ్ చౌహాన్, దీపిక దంపతులు నివాసం ఉంటున్నారు. బ్యాంకు ఉద్యోగినిగా పని చేసే నైనిటాల్‌కు చెందిన దీపికతో ఎనిమిదేళ్ల కిందటే విక్రమ్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అదే ప్రాంతంలో ఉండే షెఫాలీ భాసిన్ తివారీ (35) అనే మహిళతో విక్రమ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. గతేడాది నవంబరు నుంచి ప్రేమలో ఉన్న విక్రమ్, షెఫాలీలు.. ఆరు నెలల కిందట రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. తమ బంధానికి అడ్డుగా ఉన్న దీపికను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించారు.
విడాకులు ఇవ్వు.. లేదా చంపేయ్…
కొద్ది నెలల కిందటే దీపిక హత్యకు కుట్ర పన్నినట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆమెకు విడాకులు ఇవ్వాలని లేదా చంపేయాలని విక్రమ్‌పై షెఫాలీ వత్తిడి తీసుకొచ్చింది. ఇందుకోసం జీమెయిల్‌లో ప్రత్యేకంగా ఓ ఖాతా తెరిచి దాని ద్వారా రహస్యంగా చాట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
చివరికి ఆమె వత్తిడికి తలొగ్గిన విక్రమ్ తన భర్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. హత్య జరగడానికి రెండు రోజుల ముందు దీపికను నైనిటాల్ తీసుకెళ్లాడు. అక్టోబరు 24న అక్కడే ఆమె హత్య చేయ్యడానికి పథకం వేసినా అది కుదరకపోవడంతో తిరిగి గురుగ్రామ్ వచ్చేశాడు. దీంతో విక్రమ్‌పై షెఫాలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో వాళ్ళ సంబంధం గురించి దీపికకు తెలియడంతో ఆమె భర్తను నిలదీసింది. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం గురించి షెఫాలీకి విక్రమ్ మెసేజ్ ద్వారా చెప్పాడు. విక్రమ్ మెసేజ్‌కు వెంటనే స్పందించిన షెఫాలీ, దీపికను భవనం మీద నుంచి కిందికి తోసేయాలని దారుణమైన సలహా ఇచ్చింది. ఆమె సలహా ప్రకారం విక్రమ్ ముందు వెనుక ఆలోచించకుండా దీపికను 8వ అంతస్తు నుంచి తోసేశాడు.
అక్టోబరు 27న జరిగిన ఈ దారుణ ఘటనలో దీపిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం దీపిక ప్రమాదవశాత్తూ బిల్డింగ్ నుంచి జారి పడిపోయిందని పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు.
అయితే, విక్రమ్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో అతడి మొబైల్ పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. షెఫాలీతో కలసి దీపిక హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం షెఫాలీ ఆరు నెలల గర్భవతిగా వైద్యులు గుర్తించారు.