హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గం టిక్కెట్ తనకు దక్కకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.
ఎన్నికల బరి నుంచి తనను తప్పించడానికి ఉత్తమ్ పార్టీ అధిష్ఠానానికి తప్పుడు సర్వేలను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను గెలవలేనని చెప్పి, తనకు టికెట్ దక్కకుండా అధిష్ఠానాన్ని, స్క్రీనింగ్ కమిటీని ఉత్తమ్ తప్పుదోవ పట్టించారని అన్నారు.
సనత్ నగర్ నియోజవర్గం టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మహాకూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి అప్పగించడంతో ‘మర్రి’ ఆశలు అడియాశలయ్యాయి.
సనత్ నగర్ టికెట్ తనకు వస్తుందని టీడీపీ ముఖ్యనేతలు కూడా తనతో చెప్పారని, ఎల్బీనగర్ స్థానం కోసం పట్టుబట్టిన తమ పార్టీ నేతలు… కావాలనే సనత్ నగర్‌ను టీడీపీకి అప్పగించారంటూ మండిపడ్డారు. ఎల్లుండి సాయంత్రంలోగా తమ పార్టీ తన విషయంలో పునరాలోచించుకోవాలని మర్రి శశిధర్ రెడ్డి హెచ్చరించారు.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని, టిక్కెట్ ఇస్తే మాత్రం కచ్చితంగా సనత్ నగర్‌లో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.