న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో ఓ తెలుగు వ్యక్తిని ఓ మైనర్ బాలుడు దారుణంగా కాల్చి చంపాడు. వెంట్నార్ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్ ఎడ్లా (61)ను ఆయన నివాసం ఎదుటే 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చేశాడు. ఈ దాడిలో అతడికి మరో బాలుడు కూడా సాయం చేసినట్లుగా స్థానికుడొకరు తెలిపారు.
సునీల్ ఎడ్లా కోసం కాపు కాసిన బాలుడు.. ఆయన తన విధుల్ని ముగించుకొని ఇంటి వద్దకు రాగానే.. ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. 25 ఏళ్లుగా నార్త్ నాష్ విల్లె వెంట్‌నర్‌లో స్థిరపడిన సునీల్.. స్థానిక చర్చిలో పాటలు పాడటం ద్వారా గుర్తింపు సాధించారు. సునీల్‌కు తెలంగాణలోని మెదక్‌లోనూ, అటు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా బంధువులున్నారు.
తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం…
ఈ క్రమంలో సునీల్ ఎడ్లా తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం అతడు.. భారత్ రావడానికి సిద్ధమయ్యాడని.. ఇలాంటి సమయంలోనే ఈ దారుణం జరిగిందని అతడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సునీల్ మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తలపై గురిపెట్టి కాల్చడం వల్ల సునీల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం సునీల్‌కు చెందిన కారును తీసుకొని నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే.. సునీల్‌పై అతడు దాడి చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
మరోవైపు సునీల్ ఎడ్లాపై కాల్పులు జరిపి పారిపోయిన బాలుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వాహనంలో ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అతడి జాడ తెలుసుకుని నిందితుణ్ని అరెస్టు చేశారు. మైనర్ బాలుడు కావడం వల్ల నిందితుడి పేరును బయటపెట్టడం లేదని పోలీసులు తెలిపారు. సునీల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.