విజయవాడ: విజయవాడలోని ప్రజాశక్తి కాలనీ వద్ద జరుగుతున్న 216 ఏ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం తరలించిన ఇసుకలో బుధవారం ఒక మృతదేహం బయటపడింది. గట్టలుగా పోసిన ఇసుకను చదును చేస్తుండగా, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక మృతదేహం బయటపడింది. పనులు చేస్తున్న కూలీలు అది గమనించి వెంటనే నిర్మాణ పనులను నిలిపివేసి వారు తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. ప్రజాశక్తి కాలనీ ప్రజలు ఈ విషయాన్ని అవనిగడ్డ పోలీసులకు రిపోర్టు చేశారు.
వెంటనే ఎస్సై మణికుమార్, నాగేంద్రం సంఘటన స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఘంగసాల మండలం శ్రీకాకుళం వద్ద కృష్టానది నుండి జాతీయ రహదారి పనుల నిమిత్తం ఇసుకను రవాణా చేస్తున్నారు. అసలు ఆ మృతదేహం ఎవరిది?. ఆ మృతదేహం కృష్ణానది నుండి ఇసుకతోపాటు లారీలో వచ్చిందా? లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పాతి పెట్టారా? లేక మరేదైన జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.