మరో సచిన్!? ఆరంగేట్రంలోనే అదరగొట్టిన ప‌ృథ్వీ షా! తొలి టెస్టులోనే సెంచరీ, అదీ 100 బంతుల్లోపే!!

crickter-prithvi-shaw-century
- Advertisement -

crickter-prithvi-shaw

రాజ్‌కోట్: క్రికెట్ ప్రేమికులకు ఆ కుర్రాడిని చూస్తుంటే మరో సచిన్‌‌ని చూస్తున్నట్లే అనిపిస్తోంది. సచిన్ మళ్లీ మైదానంలోకి వచ్చి షాట్లు కొడుతున్నట్లే అనిపిస్తోంది. ఆ కుర్రాడి పేరు ప‌ృథ్వీ షా. పైగా అతడికి ఇదే తొలి టెస్టు.

వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా క్రీజులోకి దిగిన యువ క్రికెటర్ పృథ్వీ షా ఆట తీరును చూసిన సీనియర్లు విస్మయానికి గురయ్యారు. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగానే పృథ్వీ షా చెలరేగిపోయాడు.. అరంగేట్రంలోనే ఇరగదీశాడు.

తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ వెనుదిరిగినా…

మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి ఓవర్లోనే అవుటైనా, ఆ ప్రభావం తనపై పడకుండా చూసుకుంటూ పృథ్వీ షా.. టెస్టు మ్యాచ్‌ని వన్డే మాదిరిగా ఆడేశాడు. కేవలం 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పృథ్వీకి మరో ఎండ్‌లో ఉండి సహకారాన్ని అందిస్తున్న ఛటేశ్వర్ పుజారా కూడా అప్పటికి 38 పరుగులు చేశాడు. అప్పటికి భారత స్కోరు 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు.


తొలి టెస్ట్‌లోనే సెంచరీ, అదీ 100 బంతుల్లోనే…

ఆ తరువాత పృథ్వీ షా విజృంభించాడు. చిచ్చర పిడుగులా చెలరేగిపోతూ తొలి టెస్టులోనే సెంచరీ కొట్టేశాడు. అది కూడా 100 బంతులలోపే. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి టెస్టును ఆడుతూ, 100 బంతుల్లోపే సెంచరీ సాధించిన ఆటగాళ్లు ఇంతవరకూ ఇద్దరే. గతంలో వెస్టిండీస్ కు చెందిన డ్వేన్ స్మిత్ తన అరంగేట్రంలో 93 బంతుల్లో సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ తానాడిన మొదటి మ్యాచ్‌లో 85 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

ఇప్పుడు పృథ్వీ షా వీరిద్దరి సరసన నిలిచాడు. షా ఈ మ్యాచ్ లో 99 బంతుల్లో సెంచరీ సాధించాడు. భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 174 పరుగులు ఉండగా పుజారా 67 పరుగులతో మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్నాడు. దీంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది.

- Advertisement -