ఘోరం: సడన్ బ్రేక్‌తో కిందపడిన డ్రైవర్.. అదుపుతప్పి ఆగి ఉన్న బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. దంపతులు మృతి

Couple Died In Accident By Bus Driver Cell Driving In Boduppal Telangana
- Advertisement -

Couple Died In Accident By Bus Driver Cell Driving In Boduppal Telangana

బోడుప్పల్‌: ఆదివారం ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది.  ఈ ఘటనలో ఏ పాపం ఎరుగని ఓ జంట మృతి చెందారు.

మేడిపల్లి ఇనస్పెక్టర్‌ అంజిరెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం… రాజమండ్రికి చెందిన పి.కోటేశ్వరరావు (29) కొంత కాలంగా నగరంలో ఉంటూ తార్నాకలోని ఓ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.  యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందిన నాగినేని పల్లికి చెందిన స్వప్న(27)ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

పీర్జాదిగూడ మునిసిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్‌లో నివసిస్తున్న కోటేశ్వరరావు దంపతులు ఆదివారం వ్యక్తిగత పని మీద బైక్‌పై అన్నోజిగూడకు బయలుదేరారు.  నారపల్లి చౌరస్తా వరకూ వచ్చి ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చేందుకు తమ బైక్‌ను రోడ్డు పక్కన నిలిపారు.  అదే సమయంలో మరో టూ వీలర్‌ ఏపీ 29జడ్‌ 2157 ఆర్టీసీ బస్సును వేగంగా క్రాస్‌ చేసి వెళ్లింది.

ఈ క్రమంలో సడన్ బ్రేక్ వేసిన బస్సు డ్రైవర్‌ ఆ ఊపుకు తూలి బస్సులోనే తన సీట్లోంచి కింద పడిపోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ ఎక్కింది. ఆర్టీసీ బస్సు వెళ్లాక వెళ్దామని అక్కడే ఆగి ఉన్న కోటేశ్వరరావు బైక్‌ను అనూహ్యంగా ఈ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు, అతడి భార్య స్వప్న తీవ్రంగా గాయపడగా.. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే ఆ దంపతులు మరణించినట్లు వైద్యులు తెలిపారు.  మరోవైపు ఈ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ టీవీ రెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.  మల్కాజ్‌గిరి ఏసీపీ గోనె సందీప్‌రావు ప్రమాద స్థలిని సందర్శించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి కారణం.. ఆర్టీసీ బస్సు  డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బస్సు నడపడమేనని కొందరు స్థానికులు పోలీసులకు చెప్పారు.

- Advertisement -