హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ‘జనసేన’ పొటీపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరింత క్లారిటీ ఇచ్చారు. జనసేన తెలంగాణ ప్రజల పక్షాను కూడా నిలబడుతుందని, ప్రశ్నిస్తుందని తెలిపారు. కేవలం ముందస్తు ఎన్నికల కారణంగానే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన పోటీ చేయడం లేదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ లోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని ఆయన వివరించారు.
నిర్దేశిత కాలపరిమితిలో ఎన్నికలు జరిగినట్లయితే.. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై తమ పార్టీలో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించుకున్నామని, తెలంగాణలో ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒకింత కష్టమవుతుందని భావించామని తెలిపారు.
‘’తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన లక్ష్యం. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకులతో సమావేశం జరిగింది. శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరిగే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని తెలంగాణ ప్రజలకు వినయపూర్వకంగా తెలియచేస్తున్నా..’’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.