కోదాడ: ఎట్టకేలకు హాస్యనటుడు వేణుమాధవ్ నామినేషన్ వేయగలిగారు. కోదాడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని.. వేణుమాధవ్ మూడు రోజుల క్రితం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
అయితే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఆయన ఎట్టకేలకు సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలుపుతూ తన నామినేషన్ పత్రాలను ఆయన రిటర్నింగ్ అధికారికి అందించారు.
తన స్వస్థలం కోదాడ కావడంతో.. ఇక్కడి నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని తాను నిర్ణయించుకున్నట్టు వేణుమాధవ్ మీడియాకు తెలిపారు. మూడు రోజుల క్రితం ఆయన నామినేషన్ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కంటూ అధికారులు తిరిగి ఇచ్చేశారు.
నామినేషన్ పత్రాల తిరస్కరణతో కంగుతిన్న వేణుమాధవ్.. తిరిగి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధంగా వాటిని తయారు చేయించి, సోమవారం తన మద్దతుదారులతో కలసి వచ్చి సంబంధిత అధికారికి వాటిని అందించారు. దీంతో ఆయన నామినేషన్ పత్రాలను పరిశీలనకు తీసుకున్నట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.