న్యూయార్క్ : అమెరికాలోని ఓ పబ్ టాయిలెట్ గోడలపై హిందూ దేవుళ్ల చిత్రాలను చూసి కంగుతిన్న భారత సంతతికి చెందిన ఓ అమెరికా మహిళ… ఆ పబ్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతటితో ఊరుకోలేదామె. భారతీయ సంస్కృతి, హిందూ దేవుళ్ల సంప్రదాయం గురించి ఈ-మెయిల్ ద్వారా సదరు పబ్ యాజమాన్యానికి తెలియజేసింది. ఆమె మెయిల్‌కు స్పందించిన పబ్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పడంతోపాటు తమ పబ్ టాయిలెట్ గోడలపై ఉన్న ఆ చిత్రాలను తొలిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబందించిన విషయలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో వివరించింది.
వివరాల్లోకి వెళితే.. అంకిత మిశ్రా అనే భారత సంతతి మహిళ.. కొద్దిరోజుల క్రితం తన స్నేహితులతో కలిసి న్యూయార్క్ బష్విక్‌లోని హౌస్ ఆఫ్ ఎస్ పబ్‌కు వెళ్లింది. ఆ పబ్‌లోని టాయిలెట్‌కు వెళ్లిన ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.
టాయిలెట్‌లోని గోడలపై అలాంటి చిత్రాలా?
టాయిలెట్‌లోని గోడలపై హిందూ దేవుళ్లు అయిన సరస్వతి, కాళీ, వినాయక, శివుడి చిత్రాలున్నాయి. దీంతో అసలు ఇది హిందు దేవాలయమా? లేక పబ్ టాయిలెటా? అని ఆశ్చర్యపోయిన ఆమె ఇక అక్కడ ఉండలేక పబ్ నుంచి బయటకు వచ్చేసింది.
ఆ తరువాత సదరు పబ్ యాజమాన్యానికి ఒక మెయిల్ పెట్టింది. ఆ చిత్రాలన్నీ భారతదేశానికి చెందిన హిందూ దేవుళ్లవని, భారత్‌లో ఆ చిత్రాలను ఆరాధ్యదైవంగా భావిస్తారని వివరించింది. ఆమె మెయిల్‌కి స్పందించిన హౌస్ ఆఫ్ ఎస్ పబ్ నిర్వాహకులు.. ఈ విషయం తమకు తెలియదని, ఆమెరికాలోని ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రాలను చూసి.. అందంగా ఉన్నాయి కదా అని ఇక్కడ వేయించామంటూ క్షమాపణలు తెలిపారు. ఆ చిత్రాలను తొలిగిస్తామని కూడా స్పష్టం చేశారు.