ఖమ్మం: తన సొంత అక్క భర్తే ఆ యువతి పాలిట కాల యముడయ్యాడు. తనని ప్రేమించాలని, లేదాంటే కేసు పెడతానని బెదిరించి.. చివరికి ఆ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించాడు.
ఎస్సై చిలువేరు యల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామానికి చెందిన లింగాల భిక్షమయ్యకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సుష్మను.. అదే మండలంలోని సింగరాయపాలెంకు చెందిన మోటపోతుల అశోక్‌కు ఇచ్చి వివాహం చేశారు. అశోక్ కొత్తగూడెం క్రైం బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
అయితే అశోక్ కన్ను వరుసకు మరదలైన, సుష్మ చెల్లెలు లింగాల అనూష (21)పై పడింది. తనను ప్రేమించమంటూ అతడు సంవత్సర కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయం చివరికి కుటుంబ సభ్యులకూ తెలియడంతో వారు.. అది పద్ధతి కాదంటూ పెద్ద మనుషులతో అశోక్‌కు చెప్పించారు. అయినా అశోక్‌లో మార్పు రాలేదు, తన వెేధిపులు ఆపలేదు.
ఆదివారం ఉదయం చిన్నగోపతి వచ్చిన అశోక్.. అనూషకు ఇవ్వమని ఓ నోటీస్‌ను పక్కింటి యువతితో పంపించాడు. ఆ నోటీస్‌లో ఒక వ్యక్తి అనూషకు వ్యతిరేకంగా కేసు పెట్టినట్లు, ఈ విషయమై ఫలానా తేదీన కోర్టుకు హాజరుకాకపోతే ఆమెని అరెస్టు చేస్తారని ఉంది. దీంతో అనూష గాభరాపడింది. విషయాన్ని తన తల్లికి చెప్పి.. తండ్రిని పిలుచుకు రమ్మని బయటికి పంపింది.
అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. తల్లి బయటికి వెళ్లిన తర్వాత.. ఇంట్లో ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లీ తండ్రి అనూషను కాపాడే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
తన అల్లుడు అశోక్ వేధింపుల కారణంగానే చిన్నకూతురు అనూష ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి భిక్షమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చిలువేరు యల్లయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.