విజయవాడ: ఐటీ అధికారులు విధించిన ‘జీఎస్‌టీ’ జరిమానా ఓ వ్యక్తి నిండు జీవితాన్ని బలి తీసుకోవాడమే కాకుండా అతని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని సనత్‌నగర్‌కు చెందిన మహ్మద్ సాధిక్(48) పాతికేళ్లుగా విజయవాడలోని జవహర్ ఆటోనగర్‌లో లారీలకు సంబంధించిన బాడీ బిల్డింగ్, క్యాబిన్లు తయారు చేసే వర్క్‌షాపును నడుపుతున్నాడు.
జీఎస్‌టీ అమల్లోకి రాక ముందు వరకు ఈ పని చేతి వృత్తుల్లో ఒకటిగా ఉండేది. కానీ జీఎస్టీ అమలులోకి వచ్చాక.. ఇక్కడ తయారయ్యే ప్రతి వస్తువుపై పన్ను విధిస్తున్నారు. ఈ క్రమంలో సాధిక్ కొద్దినెలలుగా ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయడం లేదు. దీంతో ఐటీ శాఖ అధికారులు వచ్చి ఈ విషయమై సాధిక్‌కి నోటీసులిచ్చారు. దాంతో సాధిక్ ఓ చార్టెడ్ అకౌంటెంట్‌ను సంప్రదించి జీఎస్‌టీ నుంచి మినహాయింపు పొందే విధంగా రిటర్న్స్‌ను రూపొందించారు.
తమ బాడీబిల్డింగ్ యూనిట్‌లో పని చేస్తున్న ఐదారుగురు కార్మికులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు రిటర్న్స్‌లో చూపించారు. ఐటీ అధికారులు ఈ ఐదుగురినీ విచారించగా.. వారు భాగస్వాములు కాదని, అక్కడ పని చేస్తున కార్మికులేనని తేలింది. దీంతో ఐటీ అధికారులు సాధిక్‌కు రూ.50 లక్షల జరిమానా విధించారు. అయితే తాను ఐటీ అధికారులను వేడుకోగా.. రూ.15 లక్షలిస్తే కేసుల్లేకుండా చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు సాధిక్ తన సహచరులకు చెప్పాడు.
ఈ క్రమంలో ఐటీ అధికారుల నుంచి ఫోన్లు అధికం కావడంతో సాధక్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఏం చేయాలో తెలియక.. ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన సాధిక్ చివరికి స్ర్కూబ్రిడ్జి వద్దకు వెళ్ళి అక్కడి బందరు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి తోట్ల వల్లూరు కాల్వలో సాధిక్ మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.