ఘోరం: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని నడిరోడ్డుపై నరికిన దుండగులు…

11:00 am, Sat, 8 June 19

హైదరాబాద్: పట్టపగలు హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు ఎస్‌ఆర్ నగర్‌లో నడిరోడ్డు మీద నరికేశారు. ఇక రక్తపు మడుగులో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఘోర సంఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే… ఈ నెల 5న సంగారెడ్డికి చెందిన యువకుడు ఇంతియాజ్, బోరబండకు చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో వీరు స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు.

ఇక తర్వాత తమకు ఇరు కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వీళ్లిద్దరూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఇంటికి వెళుతున్న ఈ జంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

యువకుడిని కత్తులతో పొడిచి, దుండగులు పరారయ్యారు. అయితే దాడి చేసే సమయంలో అక్కడున్న వాహనదారులు, స్థానికులు ఏ ఒక్కరూ అడ్డుకోలేకపోయారు. కత్తిపోట్లు పొడుస్తుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప..ఆపే ప్రయత్నం చేయలేదు. చివరికి ఆ దుండగులు పారిపోయాక అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

చదవండి: 50 మంది గృహిణులతో సెక్స్.. వీడి స్కెచ్ చూసి షాక్ తిన్న పోలీసులు!