

శ్రీకాకుళం: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బొందిలీపురంలో అత్తాకోడళ్లను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ జంక్షన్లో చెప్పుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు అబ్దుల్ ఖుదీష్ జిలానీ.
ఆయన చాపురం పంచాయతీ పరిధి బొందిలీపురం విజయ్‌నగర్ కాలనీలోని ఓ భవనం మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఇతను ప్రతిరోజు దుకాణానికి వెళ్లిపోగా కుమారులిద్దరూ ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లిపోతారు.
చదవండి: ఏపీలో మరో పరువు హత్య! కూతురి గొంతునులిమి చంపిన తండ్రి?
ఇంట్లో జిలాని భార్య మెహర్‌ఉన్నీషా(37), తల్లి జురాబాయ్ (65)లు ఇంటిలోనే ఉంటారు. పిల్లలిద్దరూ ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5గంటలు కల్లా తిరిగి వచ్చేవారు. ప్రతీరోజులాగే గురువారం కూడా స్కూల్‌కి వెళ్లి తిరిగి వచ్చిన కుమారులు తలుపులు కొడుతుండగా ఎవ్వరూ తీయడం లేదు. ఈ విషయాన్ని తన తండ్రి జిలానీతో ఫోన్లో సంప్రదించగా ఎక్కడికో బయటకు వెళ్లి ఉంటారని కాసేపు ఆగమన్నాడు.
తండ్రి సూచన మేరకు వారి చిన్నాన్న ఇంటికి వెళ్లి డూప్లికేట్ తాళాలు తీసుకొచ్చి తలుపులు తెరిచి చూడగా హాలులో రెండు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తల్లి, భార్యను హత్య చేయడంతోపాటు ఇంట్లో నగదు సుమారు రూ.4 లక్షలు, విలువైన బంగారం దోచుకెళ్లారని బాధితుడు జిలానీ కన్నీరుమున్నీరయ్యారు.
చదవండి: ప్రియుడితోనే ఉంటానన్న భార్య.. నరికిచంపిన సినీ సహాయ దర్శకుడు! షాక్‌లో సినీ పరిశ్రమ…
మృతురాలి పిల్లలు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. మున్నీషా పెద్ద కుమారుడు జాఫర్ ఆర్సీఎం పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, చిన్న కుమారుడు బిషాన్ ఏడో తరగతి చదువుతున్నాడు. ముందుగా వీరిద్దరే ఇంటిలోకి ప్రవేశించి రక్తం మడుగులో పడి ఉన్న తల్లి, నాన్నమ్మ మృతదేహాలను చూడడంతో భయకంపితులయ్యారు.
ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు…
స్థానిక పోలీసు ఉన్నతాధికారులు పనసారెడ్డి, భీమారావుతో పాటు క్లూస్‌టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అంతా పరిశీలించారు. ఇంతలో డాగ్‌స్కాడ్ చేరుకొని ముందుగా మృతదేహాలు ఉన్న రూములను పది నిమిషాలు పరిశీలించాక మేడమీదకు వెళ్లిన డాగ్ అక్కడ నుంచి నేరుగా విజయ్‌నగర్ కాలనీ నుంచి ద్వారకానగర్ దగ్గర సుమారు రెండు కిలోమీటర్లు దూరం వరకూ పరుగులు తీసింది.
ఇంటికి ప్రవేశించిన పోలీసులు మూడు గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. హాలులో ఒక మృతదేహం, వంట గదిలో కూరగాయాలు మధ్యలో ఇంకొక మృతదేహం పడి ఉన్నట్టు గుర్తించారు. కాగా, షోఫాసెట్పై రెండు సూట్‌కేసులు తెరిచి వాటిలో ఉన్న కాగితాలు, విలువైన పత్రాలన్నీ చెల్లచెదురుగా పడి ఉన్నాయి.
అదేవిధంగా ఇంటి మొత్తం కారం జల్లి, నీటితో కొన్ని గదులను కూడా శుభ్రం చేసిన ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారిని బ్యాట్‌తో కొట్టి చంపినట్లుగా అక్కడ లభించిన రక్తపు మరకలతో కూడిన బ్యాట్‌ను బట్టి తెలుస్తోంది.
చదవండి: ఆశ్చర్యం: ఆవు పేడ దొంగిలించి.. కటకటాలపాలైన ప్రభుత్వోద్యోగి!
జరిగిన సంఘటనను పరిశీలిస్తే మధ్యాహ్నం 2 గంటలు ప్రాంతంలో జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి 8 గంటల సమయంలో తలుపులు తీయగా దుర్వాసన వచ్చింది. అయితే హత్య చేసిన అనంతరం బయటకు వచ్చి తాళాలు వేసి వెళ్లడంతో కుటుంబ సభ్యులుగాని బంధువులుగాని, తెలిసినవారుగాని సంఘటనలో పాల్గొన్నారా? అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, పట్టపగలే శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డున జంట హత్యలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.








