హైదరాబాద్: టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బయోపిక్స్‌లో ‘యాత్ర’ ఒకటి. ‘ఆనందోబ్రహ్మ’ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. రూ.30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
జూన్ 20న ‘యాత్ర’ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా.. వైఎస్ ఆర్ పాత్ర పోషిస్తున్న మమ్ముట్టికి సంబంధించిన సన్నివేశాలని చిత్రీకరించారు. యాత్ర సినిమా కోసం మహీ వి రాఘవ ముఖ్య పాత్రలని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వైఎస్ విజయమ్మ పాత్ర కోసం ‘బాహుబలి’ ఫేం ఆశ్రితని ఎంపిక చేసిన దర్శకుడు, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని ఎంపిక చేసినట్టు టాక్.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరొక ఆసక్తికరమైన అప్‌డేట్ అభిమానులకి షాకింగ్‌గా మారింది. వైఎస్ జగన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నారట. సూర్యకు, జగన్‌కు మధ్య ఉన్న అనుబంధం కారణంగానే సూర్య ఈ బయోపిక్‌లో నటించడానికి అంగీకరించారని తెలుస్తోంది. అలాగే అనసూయ కూడా ‘యాత్ర’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్టు వినిపిస్తోంది.