న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2019 ఎన్నికల్లో ఆమె రాయ్‌బరేలీ లేదా వారణాసి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేయకపోవచ్చని, ఒకవేళ అదేగనుక జరిగితే రాయ్‌బరేలీ నుంచి సోనియా కుమార్తె ప్రియాంకను బరిలోకి దించాలని, అలాగైతేనే రాజకీయాల్లో సోనియాగాంధీ లేని లోటును తీర్చే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతల అంచనా.
ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని, కాంగ్రెస్ పుంజుకోవడానికి ఇంతకంటే మంచి తరుణం రాదని కాంగ్రెస్ వర్గాలు వ్యూహరచన చేస్తున్నాయి. మోడీపై ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని, మోడీకి ప్రత్యర్థిగా ఆమెను నిలబెట్టి బీజేపీని ఖంగుతినిపించాలనేది వారి ప్రధాన వ్యూహం. ఈ నేపథ్యంలో ప్రియాంక కూడా తన తల్లి నియోజకవర్గమైన రాయ్‌బరేలీ కంటే కూడా వారణాసి నియోజకవర్గం వైపే మొగ్గు చూపుతున్నట్లు కొందరు నాయకులు చెబుతున్నారు.
పార్టీ శ్రేణుల డిమాండ్…
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక్కో రాష్ట్రం చేజారుతున్న కొద్దీ ఆ డిమాండ్లకు మరింత బలం చేకూరింది. అంతేకాదు, 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ సమర్థంగా నడిపించలేకపోతున్నారనే గుసగుసలు కూడా కాంగ్రెస్‌లో ఊపందుకున్నాయి. రాహుల్ కంటే కూడా ప్రియాంక పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లగలరని కాంగ్రెస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి.
ఒకవేళ ప్రియాంక దిగితే…
నిజానికి ప్రియాంకా గాంధీ ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం..’ అన్న చందాన ఈ ఈ రాయ్‌బరేలీ, వారణాసి లెక్కలేమిటనే అనుమానం కొందరికి రావచ్చు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక రావాలని చాలాకాలంగా ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే ప్రియాంక గనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే.. ఆమె ఎక్కడ పోటీ చేయాలనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రియాంక వస్తే.. అనేక రాష్ట్రాల్లో అధికారానికి దూరమై నీరసపడిపోయిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా ఉత్తేజ పరిచేందుకు అది ఉత్ప్రేకరంగా పనిచేస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
‘మోడీ’కి ప్రత్యర్థిగా…
యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో.. ప్రియాంక గనుక రాజకీయ ఆరంగేట్రం చేస్తే.. ఆమె ఇన్నాళ్లూ తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలనేది కాంగ్రెస్ నాయకుల భావన. అయితే ప్రియాంక రాజకీయ ఆరంగేట్రం ఏదో మామూలుగా కాకుండా.. కాస్తంత సంచలనం సృష్టించేవిధంగా ఉండాలని, ఆమెను మోడీకి పోటీగా నిలబెట్టాలనే అంశాన్ని మరికొందరు కాంగ్రెస్ నాయకులు తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో ఇటు రాయ్‌బరేలీ.. అటు వారణాసి నియోజకవర్గాలు ఆ పార్టీ నేతల మధ్య నానుతున్నాయి. మరోవైపు ప్రియాంక కూడా వారణాసి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పార్టీకి ‘కొత్త లుక్’ వస్తుందా?
ప్రియాంక గనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే.. కాంగ్రెస్ పార్టీకే ‘కొత్త లుక్’ వస్తుందనేది ఆ పార్టీ నాయకుల భావన. అచ్చం నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ఉండే ప్రియాంకకు అటు యూత్‌తో పాటు పెద్దల్లో కూడా క్రేజ్ ఉంటుందని కాంగ్రెస్‌లో ఒక వర్గం వాదిస్తోంది. ప్రియాంక పార్టీ పగ్గాలు చేపడితే.. బీజేపీ ప్రవేశ పెట్టిన జనాకర్షక పథకాలు, జనాకర్షక నినాదాలతో కాంగ్రెస్‌కు దూరమైన మహిళా ఓటర్లు మళ్లీ హస్తం పార్టీకి దగ్గరయ్యే అవకాశాలుంటాయనేది కూడా ఆ వర్గం వాదన. మొదటి నుంచి కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉంటూ తర్వాతి కాలంలో పార్టీకి దూరమైన ఓటర్లు మళ్లీ పార్టీ వైపుకు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
‘సూపర్ పవర్’గానా? లేక రాహుల్‌తో కలిసా?
అయితే నిన్నమొన్నటి వరకు సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటే, ఆమె తనయుడు రాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ.. సోనియా ఇంకా క్రీయాశీలంగానే ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె యూపీఎ చైర్ పర్శన్‌గా కూడా కొనసాగుతున్నారు. మరిప్పుడు పార్టీలోకి ప్రియాంక వస్తే.. ఆమె పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టాలా? లేకుంటే రాహుల్, ప్రియాంక ఇద్దరూ కలిసి పార్టీని నడిపించాలా? ఈ సందేహం చాలామంది కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో రాహుల్ పొజిషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రియాంక క్రీయాశీల పాత్ర పోషించడమే సరైన మార్గమని పలువురు పార్టీ నేతలు సూచిస్తున్నారు.