
అమరావతి: వాడీవేడీ ప్రచారాల హోరు ముగిసింది. ఎన్నికల పోరూ ముగిసింది. ఇక మిగిలింది ప్రజల తీర్పే.. ఈ తీర్పు కోసమే రాష్ట్రమంతా ఉత్కంటగా ఎదురు చూస్తోంది. నాయకుల సంగతయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అటు రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు.. ఇటు జననేత జగన్.. ఇద్దరికీ మధ్య హోరాహోరీ పోరే జరిగింది. పైకి చెప్పుకోలేకపోయినా ఇరు పార్టీల నాయకులు గెలుపెవరిది అనే ఆందోళనలోనే ఉన్నారు.
నిన్న మొన్నటి వరకూ వీరివురి మొహాలు చూస్తే జగన్ మోహన్ రెడ్డికి గెలుపు ధీమా ఎక్కువగా ఉన్నట్లు.., చంద్రబాబు నాయుడి మొహంలో కొంతమేర ఆందోళన కనిపించినట్టు ఉంది. కానీ, గత రెండు రోజులుగా బాబు మొహంలో ఏదో తెలియని ధైర్యం, నమ్మకం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రెండు రోజుల నుండి ఆయన ప్రవర్తన చూస్తుంటే కుర్రకారులా ఫుల్ జోష్ మీద ఉంటున్నారు.
ఫణి తుఫాను మొదలైన దగ్గర నుండి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేసే సరికి ఈసి అడ్డు చెప్పడంతో ఆయన ఈసిపై పోరాటం చేశారు. నిన్న మొన్నటి దాకా ఈసీపై మండి పడినా ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటూ ఏం చేస్తారో చేసుకోమ్మంటూ ఫైరవుతున్నారు. కేబినెట్ మీటింగ్ పెట్టడం ఖాయమని, ఎవరు ఆపుతారో ఆపుకోమ్మని సవాళ్ళు రువ్వుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే అధికారులు గనుక సమీక్షకి రాకపోతే వారి సంగతి అప్పుడు చెబుతానంటూ హెచ్చరిస్తున్నారు. అసలు ఈయన ఎందుకు ఇంత ధీమాగా ఉన్నారు? ఓటమి భయం అనేదే లేదా..? అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
చాలా వరకూ ఎగ్జిట్ పోల్ సర్వేలలో గానీ, రాజకీయ పండితులు చెప్పిన జోస్యం గానీ జగన్‌కే అధికారం దక్కనున్నట్టు చెప్పుకొచ్చాయి. పైగా చంద్రబాబు ఈవిఎంల విషయంలో పోరాటం చెయ్యడంతో ఆయన ఓటమి భయంతోనే అలా చేశారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి కూడా..
ఈలోపే ఏం జరిగిందో ఏమో చంద్రబాబు నాయుడులో హై వోల్టేజ్ ఒక్కసారిగా కనిపించింది. కొందరు టీడీపీ నేతలకే ఆయన ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.
లగడపాటి రాజగోపాల్ చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చంద్రబాబుకి అందాయని, స్వయంగా ఆయనే మళ్ళీ తెలుగుదేశం పార్టీదే అధికారం అని, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని భరోసా ఇచ్చారట. అందుకే మళ్ళీ గెలుస్తున్నామనే ధీమానే ఆయన ఇలా ప్రవర్తించడానికి అసలు కారణమని తేలింది.
అయితే మే 19న లగడపాటి తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానని చెప్పారు. పైగా ఇటీవల అమెరికా వెళ్ళిన ఆయన ఒక టీడీపీ సమావేశంలో పాల్గొని మళ్ళీ అధికారం టీడీపీదే అని చెప్పగనే చెప్పారు. “ఏపీలో ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టంకట్టారు..” అంటూ చెప్పడంతో టీడీపీ నేతలు మళ్ళీ గెలుపు మాదే అని ధీమాగా ఉన్నారు.
గతంలో లగడపాటి చెప్పిన జ్యోశ్యం చాలా వరకూ నిజమే అని ఋజువైనా తెలంగాణలో మాత్రం ఫలితాలు తారుమారు కావడంతో లగడపాటి సర్వే పై కొన్ని అనుమానలూ లేకపోలేదు.
ఫణి తుఫాను రాకముందు చంద్రబాబు జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి బూత్‌ల వారీగా లెక్కలు చూడాలనుకున్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో, ఏ సీట్లు పక్కాగా గెలుస్తామో.. ఎక్కడ పోటాపోటీ ఉంటుందో వంటి లెక్కలతో రావాలని బూత్ కన్వీనర్లకు పిలుపునిచ్చారు.
ఈలోపే ఫణి విపత్తు రావడంతో ఆ సమావేశాలు కాస్తా వాయిదా పడ్డాయి. మే 2న జరగాల్సిన సమీక్షలు మే 4 నుండి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఇప్పుడు లగడపాటి కూడా డేటా ఇవ్వడంతో.. ఈ డేటాతో పార్టీ వర్గాలు ఇచ్చే డేటాని పరిశీలించి గెలుపు-ఓటముల గురించి ఓ అవగాహన తెచ్చుకునే యోచనలో చంద్రబాబు ఉన్నారు.
చదవండి:చంద్రబాబుకి ఊహించని కానుక ఇచ్చిన టీడీపీ కార్యకర్త….








